దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని వార్తలు వచ్చినా ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు నేడు హైదరాబాద్ లో జరగాల్సిన భేటీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ప్రకటన చేశారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పేందుకు సిద్ధమైనా ప్రస్తుతం హైదరాబాద్ లో నమోదవుతున్న కేసుల దృష్ట్యా బస్సులు నడపకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
గతవారం విజయవాడలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందం గురించి చర్చలు జరిపారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నాలుగు దశల్లో సర్వీసులను ప్రారంభించాలని అధికారులు ప్రాథమిక చర్చల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి భేటీ అయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని వారు భావించారు. కానీ ఊహించని విధంగా గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో అంచనాలను మించి కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇరు రాష్ట్రాల్లో కరోనా అదుపులోకి వస్తే మాత్రమే అంతర్రాష్ట్ర సర్వీసుల గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ లాక్ 1.0 సడలింపుల తర్వాత హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం.... ఏపీ నుంచి హైదరాబాద్ కే ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నడుపుతుండటంతో అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు మరొకొన్ని రోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది. ఏపీలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ కు వెళ్లాలని భావించిన ప్రయాణికులు సైతం నమోదవుతున్న కేసుల దృష్ట్యా కొంతకాలం పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: