తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. దేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త అయిన బాబుగారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆయా వ‌ర్గాలు ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తుండ‌గా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన విష‌యంలో చంద్ర‌బాబు కిమ్మ‌న‌కుండా ఉండ‌టం, పైగా చిత్ర‌మైన కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హంగా మారింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13వ తేదీన బీజేపీ నేత‌లు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఏపీ మాజీ ఈసీ నిమ్మగడ్డతో సమావేశమవ‌డం, ఈ ముగ్గురు నేతల రహస్య సమావేశం దాదాపు గంటన్నరకు పైగా కొనసాగిన‌ దృశ్యాలు మంగళవారం పలు చానళ్లలో ప్రసారమయ్యాయి. అయితే, రాష్ట్రానికి సంబంధించిన ఈ ముఖ్య‌మైన అంశం గురించి చంద్ర‌బాబు మాట‌మాత్ర‌మైన ప్ర‌స్తావించ‌లేదు. 

 

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకే నిమ్మగడ్డ సుజనాను కలసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించగా పార్టీ నేత చంద్ర‌బాబు మాత్రం దీనిపై స్పందించ‌లేదు. పైగా మంగళవారం ఆయన ఆన్‌లైన్‌లో టీడీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే, ఈ విపత్తులో సైతం వైకాపా ప్రభుత్వం కుంభకోణాలు, కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండి పడ్డారు.

 

రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారని, దీన్ని బట్టే రాష్ట్రంలో వైకాపా ఎలాంటి అకృత్యాలకు పాల్పడు తుందో స్పష్టమవుతోందని చంద్ర‌బాబు అన్నారు. ఇంకొక వైపు అధికార పార్టీకి చెందిన ఎంపీ తనకు భద్రత లేదని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేయడం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రధానిని, స్పీకర్‌ను కోరారని, దీన్ని బట్టే రాష్ట్రంలో అధికార పార్టీ ఎంత భయోత్పాతానికి పాల్పడుతుందో అవగతమవు తుందన్నారు. పరిపాలన చేతగాక ప్రతిపక్షాలపై ప్రతీకారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ పనిచేస్తున్నారని, ఇంత అధికార దుర్విని యోగం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రవర్తన మార్చుకోవాలని, దౌర్జన్యాలను, దాడులను నిలిపివేయకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం దగ్గర్లోనే ఉందని చంద్రబాబు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: