టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగా తెలంగాణ విపక్ష పార్టీలన్నీ ఇప్పుడు ఆయనపై వేలెత్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం, పరిస్థితి అదుపు తప్పడం, వంటి పరిణామాలతో జనాల్లోనూ ఒకింత ఆగ్రహం కనిపిస్తోంది. ఈ అగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి. కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఆయన రాజకీయం కారణంగానే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రమాదంలో పడ్డారని బీజేపీ పదే పదే విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య నిత్యం వందల సంఖ్యలో నమోదు అవుతుండడం, మిగతా జిల్లాల్లోనూ, అంతే స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్న తీరుకు కేసీఆరే బాధ్యుడని బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. 

IHG


తమిళనాడు, ఢిల్లీ, బొంబాయి ఒంటి ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణాలో నమోదవుతున్న కేసులు కాస్త తక్కువే. అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి ప్రతి విమర్శలు చేయలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉండిపోయింది. మొదటి నుంచి కరోనా విషయంలో కెసిఆర్ అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పుడు కూడా కేసీఆర్ కఠినంగా దానిని అమలు చేయడమే కాకుండా, కేంద్రం లాక్ డౌన్ ఎత్తి వేస్తున్న సమయంలో కేసీఆర్ తెలంగాణలో మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకునేవారు. కరోనా కట్టడి విషయంలో కెసిఆర్ పై మొదట్లో ప్రశంసలు వచ్చాయి. 


కానీ ఆ తర్వాత కరోనా టెస్ట్ లు నిర్వహించే విషయంలో కెసిఆర్ వెనకడుగు వేయడం , ఈ విషయాన్ని కోర్టులు కూడా తప్పుబట్టడం తో కేసీఆర్ వ్యవహారశైలిపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఇక బిజెపి మస్లిజ్ పార్టీ పై గురి పెట్టి, ఆ పార్టీ ఒత్తిడితోనే కెసిఆర్ కరోనా టెస్టులు నిర్వహించడం లేదని, పాజిటివ్ కేసులు సంఖ్య తక్కువగా చూపిస్తున్నారనే విమర్శలు చేస్తోంది. మజ్లిస్ ఒత్తిడితో కేసీఆర్ టెస్ట్ లు పెద్ద ఎత్తున చేయకుండా, పాజిటివ్ కేసులను తక్కువ చూపిస్తున్నారు అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. 


మర్కజ్ లింకులు బయటపడిన తర్వాత హైదరాబాద్లో భారీ సంఖ్యలో టెస్టులు చేయాల్సి ఉన్నా, కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని బిజెపి మండిపడుతోంది. దీనికి టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తోంది. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని, ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం తమపైనే విమర్శలు చేయడం సరికాదంటూ మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: