తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. కరోనా కేసులు పెరుగుతూ ఉండటం.. ఇటు బస్సు సర్వీసుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో...చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ రోజు  జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడింది. 

 

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సేవలు నిలిచిపోయి మూడు నెలలయింది. మార్చిలో లాక్‌డౌన్‌తో అంతరాష్ట్ర సర్వీసులు ఆగిపోయాయి. అయితే సడలింపులు ఇచ్చాక... జిల్లాల్లో బస్సులు నడుస్తున్నాయి. సోషల్‌ డిస్టన్స్‌తో బస్సులు తిరుగుతున్నాయి. అదే ఉత్సాహంతో రెండు రాష్ట్రాలు బస్సులు తిప్పడానికి సన్నద్ధమయ్యాయి. అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు కూడా ప్రారంభం కావడంతో... త్వరలోనే బస్సులు పడుస్తాయని భావించారు. కానీ ఇంతలోనే తీవ్ర నిరాశే ఎదురైంది. అనివార్య కారణాల వల్ల ఈ రోజు జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు ఇరు రాష్ట్రాల అధికారులు.

 

గత వారం విజయవాడలో సమావేశమైన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మరోసారి చర్చించుకొని ఫైనల్ చేసుకోవాలని అప్పుడే అనుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు  అధికారులు హైదరాబాద్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కానీ ఏం జరిగిందో తెలియదు...చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం మళ్లీ ఎప్పుడు ఉంటుందా అన్నది క్లారిటీ లేదు. దీంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. 

 

ఏపీ, తెలంగాణ మధ్య ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులకు ఒప్పందం కొలిక్కి రావడం లేదు. ఏపీ ఆర్టీసీ అధికారులు ఒకటి చెబుతుండగా, టీఎస్‌ ఆర్టీసీ అధికారులు మాత్రం మరొకటి అంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన భేటీలోనూ రెండు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాము ఎన్ని కిలోమీటర్లు నడిపితే... ఏపీ కూడా అంతే నడపాలన్నది తెలంగాణ అధికారుల డిమాండ్‌. తమ బస్సుల కంటే ఏపీ బస్సులను ఎక్కువగా తిప్పుతున్నారని చెబుతున్నారు. తెలంగాణ 722 బస్సులను తిప్పుతుంటే .. ఏపీ వాళ్లు 1,006 బస్సులను నడుపుతున్నారని గణాంకాలు చూపిస్తున్నారు. తెలంగాణ కంటే లక్ష కిలోమీటర్లు ఎక్కువగా ఏపీ వాళ్లు తిప్పుతున్నారని... ఫలితంగా తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని టీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ ఎన్ని కిలోమీటర్లు తిప్పితే.. ఏపీ కూడా అంతే నడపాలని కోరుతున్నారు. 

 

స్టేట్ అగ్రిమెంట్ విషయంలో విభజన జరిగినప్పుడు చర్చ జరగలేదని, అవకాశం వచ్చింది గనుక ఇప్పుడు ఆ విషయంపై కూడా చర్చ జరిపినట్లు ఏపీ అధికారులు తెలిపారు. అన్ని కొలిక్కి వచ్చాకే అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: