ఎవ‌రు తీసుకున్న‌గోతిలో వారే  ప‌డ‌టం అంటే ఏంటో డ్రాగ‌న్ కంట్రీ చైనాకు బాగా తెలిసివ‌స్తోంది. కరోనా పుట్టినిల్లు అనే అపప్ర‌ద‌ను ఎదుర్కుంటున్న ఆ దేశాన్ని ఇంకా మహమ్మారి వీడ‌లేదు. తాజాగా, మరోసారి పంజా విసురుతోంది.  చైనా దేశంలో కొత్తగా 29 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా ఆరోగ్యసంస్థ అధికారులు ప్రకటించారు. రాజ‌ధాని బీజింగ్ నగరంలో మళ్లీ వైరస్ ప్రబలుతుండటంతో  అధికారులు ప్రజలందరికీ మరోసారి  కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్ర‌మంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన డెలివరీ మ్యాన్‌ కు పాజిటివ్ గా తేలింది. దీంతో బీజింగ్ నగరంలో కలకలం రేగింది. 

 

 

గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ వెలుగుచూసింది. అనంతరం వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మార్చి నెలలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదుకాకపోవడంతో కరోనాపై విజయం సాధించామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నెలన్నర వ్యవధిలోనే దేశంలో రెండో దశ కరోనా కేసులు ప్రారంభమయ్యాయి. తాజాగా, చైనా రాజధాని బీజింగ్ లో 47 ఏండ్ల ఫుడ్ డెలివరీ మ్యాన్ జూన్ 1నుంచి 17వతేదీ వరకు డాక్సింగ్, ఫంగ్ షాన్, డాంగ్ చెంగ్, ఫెంగటయ్ ప్రాంతాల్లో రోజుకు 50 మందికి చొప్పున ఆహారాన్ని డెలివరీ అందించాడు. దీంతో ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. ఫుడ్ డెలివరీ ఎవరెవరికి చేశాడనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు వైద్యాధికారులు. మొత్తంమీద 249 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కరోనా ప్రబలిందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా,ఫుడ్ డెలివరీ మ్యాన్ కు కరోనా వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలడంతో ఆయా ప్రాంతం లో వారంతా ఆందోళన చెందుతున్నారు. మ‌రోవైపు దేశంలో రెండో దశ కరోనా కేసులకు ప్రధాన కేంద్రంగా మారిన బీజింగ్‌లోని అతిపెద్ద హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌ జిన్‌ఫడీని ఇప్ప‌టికే మూసివేశారు. దానికి సమీపంలో ఉన్న పదకొండు నివాస సమూదాయాల్లో అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. అక్కడి నుంచి ప్రజలు బయటికి రాకుండా రోడ్లను పూర్తిగా మూసివేశారు. మార్చి నెల తర్వాత బీజింగ్‌లో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: