బీజేపీ నేత కపిల్ మిశ్రా మద్దతుదారులు సీఏఏ వ్యతిరేక శిబిరాన్ని తగలబెట్టారన్న వదంతులే.. ఢిల్లీ అల్లర్లకు కారణమని పోలీసుల ఛార్జ్ షీట్ తేల్చింది. స్వరాజ్ అభియాన్ చీఫ్ యోగేంద్ర యాదవ్ ప్రసంగాన్ని ప్రస్తావించింది. అయితే ఆయన్ను నిందితుడిగా పేర్కొనలేదు. కపిల్ మిశ్రా సహా ఇతర బీజేపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ప్రస్తావించలేదు. 

 

బీజేపీ నాయ‌కుడు క‌పిల్ మిశ్రా మ‌ద్దతుదారులు పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం వ్యతిరేక నిర‌స‌న వేదిక‌కు నిప్పంటించార‌నే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింస‌కు దారి తీసింద‌ని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కాగా క‌పిల్ మిశ్రా త‌న మ‌ద్దతుదారుల‌తో క‌లిసి మౌజ్‌పూర్‌లో ఫిబ్రవ‌రి 23న సీఏఏ అనుకూల‌ ర్యాలీ తీశారు. అయితే వీరు జ‌ఫ‌రాబాద్‌లో సీఏఏ వ్యతిరేక నిర‌స‌న వేదిక‌కు నిప్పంటించార‌నే వ‌దంతులు వ్యాపించ‌డంతో పెద్ద ఎత్తున నిర‌స‌న‌కారులు రోడ్ల మీద‌కు వ‌చ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల‌, వ్యతిరేక వ‌ర్గాల మ‌ధ్య ప్రారంభ‌మైన‌ ఘ‌ర్షణ‌లు హింసాత్మకంగా మారడంతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు విస్తరించాయి. ఈ క్రమంలో దయాళ్ పూర్‌లో ఆందోళ‌న‌ల‌ను అడ్డుకునేందుకు ప్రయ‌త్నించిన‌ హెడ్ కానిస్టేబుల్ ర‌త‌న్ లాల్‌పై దుండ‌గులు మూక దాడిచేసి అత‌డిని దారుణంగా హ‌త్య చేశారని చార్జిషీట్ లో ప్రస్తావించారు. 

 

అయితే అల్లర్లను ప్రేరేపించడానికి ఉద్దేశపూర్వకంగా వదంతులు వ్యాపింపజేశారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ పేరు ఛార్జ్ షీట్లో ప్రస్తావించినా.. ఆయన్ను నిందితుడిగా పేర్కొనలేదు. అయితే అత‌ను చాంద్ బాగ్ లో సీఏఏ వ్యతిరేక శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారని పేర్కొన్నారు. యోగేంద్ర యాదవ్ తో పాటు ఏఐఎంఐఎం, ఏఐఎస్ ఏ నేతలతో సీఏఏ వ్యతిరేక శిబిరానికి సంబంధాలుండటం చూస్తుంటే.. అల్లర్ల వెనుక రహస్య అజెండా ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

 

ఇక‌ సీఏఏ వ్యతిరేక నిర‌స‌న‌కారుల‌పై బీజేపీ నేత క‌పిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగ‌మే ఢిల్లీలో అల్లర్లకు నాంది అయింద‌ని అంత‌ర్జాతీయ మీడియా సైతం అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలపై ఆరోపణలు వచ్చినా.. ఛార్జ్ షీట్లో వారి పేర్లు లేవు. కొద్దిరోజుల పాటు కొన‌సాగిన‌ ఢిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది మ‌ర‌ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: