జూన్ నెల 15వ తేదీన భారత్ చైనా దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ లో చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా యాప్ లను నిషేధించాలని భావించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది నెటిజన్లు తమ మొబైల్ ఫోన్లలో చైనా యాప్ లను తొలగిస్తున్నారు. చైనా యాప్ లలో ఒకటైన టిక్ టాక్ యాప్ ను చాలా మంది ఇప్పటికే మొబైల్ ఫోన్ల నుంచి తొలగించారు. 
 
కొందరు టిక్ టాక్ యాప్ కు తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారు. టిక్ టాక్ కు ప్రత్యామ్నాయ యాప్ లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్న తరుణంలో దేశీయ యాప్ చింగరి మొదటి మూడు రోజుల్లో 5 లక్షల డౌన్ లోడ్లు నమోదు చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో చింగరి కోసం డిమాండ్ నంబర్‌ వన్‌ స్థానంలో ట్రెండ్‌ అయిందని సమాచారం. ఈ యాప్ అనేక భారతీయ భాషల్లో లభ్యం అవుతుందని తెలుస్తోంది. 
 
ఈ యాప్ ను ఉపయోగించి యూజర్ వీడియోలను డౌన్ లోడ్, అప్‌లోడ్‌ చేయవచ్చని, కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ కావడానికి, కంటెంట్‌ను పంచుకోవడానికి, ఫీడ్‌బ్యాక్‌ బ్రౌజ్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వాట్సప్ స్టేటస్, వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌, స్టిక్కర్లు, ఫొటోలు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. టిక్ టాక్ కంటే మెరుగైన ఫీచర్లతో ఈ యాప్ నెటిజన్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 
 
 
ఐతే నిపుణులు మాత్రం చైనాపై కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని దశల వారీగా మనం ఎదుగుతూ చైనా ఉత్పత్తులు, యాప్ ల వినియోగాన్ని తగ్గించాలని యోచిస్తున్నారు.స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళితే మనకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అకస్మాత్తుగా చైనాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: