ఓరుగ‌ల్లు కాంగ్రెస్‌లో  జంగా రాఘ‌వ‌రెడ్డి త‌న రాజ‌కీయంతో క‌ల‌కలం రేపుతున్నారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు కూడా త‌న వ్య‌వ‌హ‌ర శైలితో గుబులు పుట్టిస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. వాస్త‌వానికి గ‌త ఏడాది పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుపై పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన‌ప్ప‌టికీ  పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా ఉంటూ వ‌స్తున్నారు. అంతేకాక పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న‌ట్లు ఆ పార్టీ శ్రేణుల్లో బ‌ల‌మైన విశ్వాసం ఉంది. ఈనేప‌థ్యంలోనే స‌హ‌జంగానే జ‌న‌గామ రాజ‌కీయాల్లో కాస్తంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. 


జ‌న‌గామ డీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. జ‌న‌గామ జిల్లా కాంగ్రెస్ పార్టీపై చాలా వ‌ర‌కు ప‌ట్టు సాధించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పొన్నాల ల‌క్ష్మ‌య్య గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే నాటి నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు కాసింత దూరంగానే ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాల‌కు కూడా అంటీ ముట్టన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ స‌మ‌యంలోనే ఇక్క‌డ జంగా త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నార‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. ఎలాగూ జనగామ డీసీసీ చీఫ్  తానే కాబట్టి, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో జనగామ నేత, సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య వ‌ర్గానికి చెందిన  ఏ ఒక్క‌రికి టికెట్లివ్వలేదు. ఒక దశలో తాను జనగామ నుంచే పోటీ చేయ‌డానికి  సిద్ధంగా ఉన్న‌ట్లుగా స‌న్నిహితుల‌కు చెప్పిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 


అంతేకాక పొన్నాల నివాసాని అత్యంత స‌మీపంలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పార్టీ కార్య‌క్ర‌మాల‌ను జోరుగా నిర్వ‌హిస్తుండ‌టం విశేషం. ఈ విష‌యం తెలిసిన పొన్నాల లక్ష్మయ్య అగ్గిమీద గుగ్గిలం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు వ‌రంగ‌ల్ అర్బ‌న్ ప‌శ్చిమ కాంగ్రెస్ రాజ‌కీయాల్లోనూ త‌ల దూర్చుతూ...శ్రేణుల‌తో మీటింగ్‌లు ఏర్పాటు చేయ‌డం ఏంట‌ని డీసీసీ అద్య‌క్షుడు నాయిని ఏకంగా ఉత్త‌మ్‌కే ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడ‌ని తెలుస్తోంది. దీంతో ఆయ‌న ఓ ముఖ్య‌నేత‌ను రంగంలోకి దింపి స‌ర్దుబాబు చేయించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స‌మాచారం. జంగా ఇప్పుడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల‌కుర్తి, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌ర్చీప్ వేసేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి మిగ‌తా నేత‌లు ఊరుకుంటారా..? అంటే భ‌విష్య‌త్తే అన్నింటికి స‌మాధానం చెబుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: