కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా, ఏపీలో బలపడలేకపోతున్నామనే బాధ ఎప్పటి నుంచో ఏపీ బిజెపి నాయకుల్లో ఉంది. బిజెపి ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి, ఇప్పటి నుంచి బలపడే విషయంపై దృష్టి పెడితే, 2024 ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చని, ఎలాగూ జనసేన పార్టీ మద్దతు ఉంటుంది కాబట్టి అది సాధ్యమవుతుందని భావిస్తూ వస్తున్నారు. ఇక కొంతమంది నాయకులు ఏపీలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనమైతేనే బిజెపి కి అవకాశం దక్కుతుందనే అంచనాల్లో ఉన్నారు. ఇప్పటికే మూడు వర్గాలుగా ఏపీ బీజేపీ నాయకులు విడిపోవడం, ఎవరికివారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై కొద్దిరోజుల క్రితమే బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం, నాయకులంతా ఏకాభిప్రాయంతో ఉంటూ పార్టీ పరపతిని పెంచాలని, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని గట్టిగానే క్లాస్ పీకారు. 


అయినా చాపకింద నీరులా గ్రూపు రాజకీయాలు ఏపీ బిజెపిని పట్టిపీడిస్తున్నాయి. మొదటి నుంచి బీజేపీ లో ఉన్న నాయకులు అంతా ఒక వర్గంగా ఉంటే, జగన్ కు మద్దతు పలికే వారు మరో వర్గం, తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరిన చంద్రబాబు కు అత్యంత నమ్మకస్తులైన వారు మరో వర్గంగా ఉన్నారు. ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టుగా వారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తుండడం అందరిని గందరగోళంలోకి నెట్టుతూ వస్తోంది. ఇది ఎలా ఉంటే, ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహారంలో బాబుకు అత్యంత నమ్మకస్తులైన బిజెపి నాయకులు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు చిక్కుకోవడం, వైసిపి పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై విమర్శలు చేయడం, వంటి పరిణామాలతో బిజెపి చిక్కుల్లో పడినట్లు అయింది.


 నిమ్మగడ్డ వ్యవహారంలో బిజెపి పాత్ర కూడా ఉందనే అనుమానాలు జనాల్లో కూడా రావడంతో, బిజెపి అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బిజెపి నాయకులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమా లేక పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో చేయకపోతే ఎప్పటికీ ఏపీలో బీజేపీ బలం పడలేదని, వారు బిజెపి లోనే ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ గా ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: