బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకేసులో ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఉరి వేసుకోవడం వల్లే ఉపిరాడక చనిపోయినట్లు తేలింది. ఐతే ఒకప్పుడు మరణమంటే భయమన్న సుశాంత్‌... ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.

 

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ సుసైడ్‌ చేసుకొని పది రోజులు గడుస్తున్నా...ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పోలీసులకు అందజేశారు డాక్టర్లు. ఉరి వేసుకోవడంతో ఊపిరాడక మృతిచెందినట్లు తేలింది. ఇక సుశాంత్‌కు సంబంధించిన ఉదర భాగంలోని కొన్ని అవయవాలను ప్రత్యేక పరీక్షల నిమిత్తం పంపారు.

 

సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదికపై ముగ్గురు వైద్యులు సంతకం చేయగా, తుది నివేదికపై ఐదుగురు వైద్యులు సంతకం పెట్టారు. మరోవైపు డైరక్టరేట్‌ ఆఫ్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌‌ సర్వీసెస్‌కు పోలీసులు లేఖ రాశారు. సుశాంత్‌ అవయవాలపై చేసే కెమికల్‌ పరీక్షల నివేదికలు కూడా త్వరగా సమర్పించాలని కోరారు. సుశాంత్‌ చనిపోయే ముందు ఎలాంటి బాధనూ అనుభవించలేదట. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆయన గోళ్లు కూడా శుభ్రంగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.

 

సుశాంత్‌ కేసుకు సంబంధించి మొత్తం 23 మంది వాంగ్మూలాల్ని పోలీసులు నమోదు చేశారు. వీరిలో సుశాంత్‌ సీఏ, సుశాంత్‌ తండ్రి, ముగ్గురు సోదరిలు, అతని స్నేహితుడు సిద్ధార్థ్‌ పిథాని, వంట మనిషి కేశవ్‌ సహా పలువురి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సుశాంత్‌ పెంచుకుంటున్న శునకాన్ని కూడా పరీక్షించారు.

 

ఐతే.. సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య తర్వాత.. ఆయన గతంలో మరణంపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు జీవితంలో దేనికీ భయపడరా అని ప్రశ్నించగా... మరణం అంటే భయమని చెప్పారు. నేను  మూడు గంటలు నిద్రపోతే ఆ తర్వాత నేనెవరో కూడా నాకు తెలియని లోకంలోకి వెళ్లిపోతుంటా. మనం చనిపోయినప్పుడు కూడా ఇలానే జరుగుతుందంటూ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. 

 

సుశాంత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా సుశాంత్‌ సొంత రాష్ట్రమైన బిహార్‌లో సల్మాన్‌, ఆలియా భట్‌, కరణ్‌ జోహార్‌ చిత్రాలను  నిషేధించాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆలియా, సల్మాన్ సినిమాలను బీహార్‌లో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: