కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్నా స్వీయ ర‌క్ష‌ణ‌లో, భౌతిక దూరం పాటించ‌డంలో  ప్ర‌జ‌లు తీవ్ర నిర్ల‌క్ష్యాన్ని చూపుతున్నార‌ని క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి యడియూరప్ప సీరియ‌స్ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరు ప్రజలకు గురువారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదా మరోసారి లాక్‌డౌన్‌ విధించమంటారా? అని ప్రజలపై ఆసహనం వ్యక్తం చేశారు. కోవిడ్‌ను నియంత్రించే చర్యలను అందరూ పాటించాలని, లేదంటే మాత్రం బెంగళూరులో మరో లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించారు. ప్రజలందరూ మరో లాక్‌డౌన్ ఉండకూడదన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం... కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని తెలిపారు.

 

బెంగళూరులో నానాటికీ కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో బెంగళూరులో తిరిగి లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అన్న అంశంపై రెండు రోజుల పాటు సీఎం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలో బెంగళూరు కూడా ఒకటి. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 418 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

కోవిడ్ రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. దానిని నియంత్రించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం. కొన్ని కొన్ని ప్రాంతాలను పూర్తిగా మూసేసాం కూడా. కోవిడ్ నియంత్రణకు రెండ్రోజుల పాటు మంత్రులు, అధికారులతో చర్చోపచర్చలు జరుపుతున్నాం’’ అని సీఎం యడియూరప్ప విలేక‌రుల స‌మావేశం తెలిపారు. మరిన్ని కఠినమైన నిబంధనలను అమలు చేసే విషయంపై శుక్రవారం మంత్రులు, అన్ని పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు యడియూరప్ప వెల్లడించారు. అయితే బెంగళూరులో తిరిగి లాక్‌డౌన్ విధించే విషయంలో మాత్రం నిపుణులతో చర్చించిన తర్వాతే ఓ కచ్చితమైన నిర్ణయానికి వస్తామని ఓ మంత్రి ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: