టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఎన్నిసార్లు చక్రం తిప్పారనే విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు సైకిల్ చక్రాలతో ఆడుకున్నంత సులువుగా అప్పటిలో బాబు, జాతీయ రాజకీయాల్లో చక్రాల ఆట ఆడేవారు. ఇక అప్పుడు చక్రాల ఆట ఆడుకున్న విషయాలని బాబు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. కాకపోతే అప్పటిలో బాబు చక్రాలు తిరిగాయి గానీ, ఈ మధ్య మాత్రం తిరగట్లేదు. ముఖ్యంగా మోదీ పీఎం అయిన దగ్గర నుంచి బాబు పప్పులు ఉడకట్లేదు.

 

2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉన్నా సరే బాబుకు చక్రం తిప్పే అవకాశం దక్కలేదు. మోదీ, అమిత్ షాలు బాబుకు అంత స్కోప్ ఇవ్వలేదు. ఇక నాలుగేళ్ళు చూసి బాబు, ప్రత్యేకహోదా పేరుతో బయటకొచ్చేసి, నానా హడావిడి చేసిన విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పేయాలని చూశారు. అందుకు టీడీపీకి బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో పార్టీతో కూడా కలిశారు. ఇంకా మోదీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అన్నిటిని ఏకం చేసి తన సత్తా ఏంటో చూపిద్దాం అనుకున్నారు.

 

కానీ చక్రాలు ఎప్పుడు ఒకేలా తిరగవు కదా...2019 ఎన్నికల్లో మోదీ మళ్ళీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేశారు. ఇటు ఏపీలో బాబుని చిత్తుగా ఓడించి జగన్ అధికారంలోకి వచ్చేశారు. ఇక ఆ తర్వాత బాబు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. బీజేపీకి దగ్గరవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన అనుచరులని బీజేపీలోకి పంపించి రాజకీయం చేస్తున్నారు. కానీ మోదీ, అమిత్ షాలు బాబుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఛాన్స్ రాకపోయినా సరే బాబు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 

అయితే బాబు ఓ వైపు ఇలా మోదీకి దగ్గరవ్వాలని చూస్తూనే, మరోవైపు రాహుల్‌ని వదల్లేదని తెలుస్తోంది. ఇప్పటికీ బాబు...కాంగ్రెస్ సీనియర్ నేతల టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పరిస్తితి ఎటు పోయి ఎటు వస్తుందనే భయంతో సేఫ్ సైడ్ రాహుల్‌తో కూడా టచ్‌లో ఉంటున్నారట. ఈ విధంగా బాబు అటు ఇటు చక్రాలు ఆట ఆడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: