ఏపీలో వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. అంటే కన్ను కుట్టే మెజారిటీ ఇది. నిజానికి ఆ మూడు ఎంపీ సీట్లు కూడా టీడీపీకి దక్కకుండా స్వీప్ చేసేంత ఊపు 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చింది. ఇన్ని సీట్లు, ఓట్లు వస్తాయని బహుశా వైసీపీ అధినాయకత్వం కూడా ఊహించి ఉండదు. ఏడాదిగా వైసీపీ తన ఎంపీలను నిలబెట్టుకుంది. కానీ ఇపుడు అందులో నుంచి ఒక ఎంపీ జారిపోతున్నారు. అంటే 21 మందే నిఖార్సుగా వైసీపీలో ఉంటారన్నమాట.

 

మరి నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు వెనక ఎవరు ఉన్నారు. ఆయన ఇంత నిబ్బరంగా నిలబడి ఏపీలో రాజకీయ  బాహుబలి లాంటి జగన్ని ఎదిరించడానికి ఆయనకు ధైర్యం ఇచ్చిన వారు ఎవరు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే కేంద్రంలో బీజేపీ దీని వెనక ఉంది అన్న చర్చ కూడా వస్తోంది. బీజేపీ టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసుకుంది. పైగా వారినే తెలుగుదేశంగా గుర్తించి మొత్తం విలీనం కూడా చేసుకున్నారు.

 

మోడీ షాలు ఉన్న బీజేపీ గత భారతీయ జనతా పార్టీలా నీతులు సిధ్ధాంతాలు ఊరకే వల్లిస్తూ కూర్చోదని అనేక సందర్భాల్లో రుజువు అయింది. ఇక ఏపీ వరకూ వస్తే జగన్ తో కొత్తల్లో ఉన్న మొహమాటాలు, రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న కారణాన కొంత తగ్గిందని అంటారు.

 

ఇపుడే అసలైన గేం మొదలైంది అని అంటున్నారు. మరి రాజు గారి వెనక బీజేపీ ఉందని గట్టిగా చర్చ సాగుతున్న వేళ జగన్ ఎదిరించి నిలబడతారా, తొడగొట్టి సవాల్ చేస్తారా అన్నది కూడా మరో చర్చ. మా నాయకుడు సోనియా గాంధీనే ఎదిరించిన నేత, ఆయనకు భయం తెలియదు,  దైర్యంగా దూసుకుపోతారు అని వైసీపీ నేతలు ఓ వైపు చెబుతున్న వేళ జగన్ నిజంగా బీజేపీ ఈ రకంగా తన పార్టీ ఎంపీలకు గేలం వేస్తూంటే చూస్తూ ఊరుకుంటారా. ఆయన ఏం చేస్తారు అన్నది ఇపుడు ఆసక్తికరమైన అంశం. మరి చూడాలి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: