తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అన్ లాక్ 1.0 సడలింపుల తర్వాత నగరంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ విజృంభణ ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 920 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది. 
 
ఈ కేసులలో 737 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో వ్యాపారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లెక్కడం వల్లే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 
 
హైదరాబాద్ నగరంలో మార్కెట్లు, వ్యాపార సముదాయాలకు అనుమతులు ఇవ్వడంతో వైరస్ నగరమంతా వ్యాప్తి చెందింది. దీంతో నగరవాసులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించకపోయినా సికింద్రాబాద్ జనరల్ బజార్ తో పాటు క్లాత్ మర్చంట్స్ వ్యాపారులు దుకాణాలు మూసివేస్తామని ప్రకటించారు. అనేక వ్యాపార సంస్థలు ఇదే తరహా నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. 
 
లాడ్ బజార్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు ఏడు నుంచి పది రోజుల పాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని అన్ని ఏరియాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైరస్ భారీన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ భారీన పడుతున్నామని మరికొంతమంది చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. దీంతో నగరంలో అనధికారిక లాక్ డౌన్ కొనసాగుతోంది.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: