దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసులతో కరోనాకేసుల సంఖ్య 4,90,401కు చేరింది. వీరిలో 2,85,637 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1,89,463 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో 407 మంది మృతి చెందటంతో మృతుల సంఖ్య 15,301కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా రోగులు ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నాయి. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడని వారికి హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని చెబుతున్నాయి. కరోనా సోకిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ సమయం పట్టదు. 
 
కరోనా సోకిన వారు హోం క్వారంటైన్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ సోకిన వారు ఇంట్లో ఉంటే బట్టలు, గిన్నెలు, ప్లేట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మంచం, దిండు, దుప్పటి, భోజనం తినే ప్లేట్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు కుటుంబ సభ్యులు గ్లోవ్స్ ధరించడంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తికి భోజనం అందించే సమయంలో మాస్క్, గ్లోవ్స్ ఖచ్చితంగా ఉండాలి. 
 
కరోనా సోకిన వ్యక్తి ప్రతి రెండు గంటలకు ఒకసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. తుమ్మే సమయంలో మోచేతిని అడ్డుగా పెట్టుకుని వెంటనే వాష్ చేసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తి ప్రత్యేక గదిలో ఉండటంతో పాటు ఏసీని ఉపయోగించకూడదు. వైద్యులు సూచించిన ప్రకారం మందులు వేసుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ధైర్యం కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించడం కష్టమేమీ కాదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: