వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుంది. మొత్తం 175లో 151 గెలుచుకోవడం అంటే సాధారణ విజయం కాదు. జనం ముక్తకంఠంతో జగన్ ను సీఎం చేయాలనుకున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. పూర్తి ప్రజామద్దతు ఉంటేనే సరిపోదు. పార్టీ అన్నాక కొన్ని వ్యవస్థాగతమైన నిర్మాణం ఉండాలి.

 

 

వైసీపీలోని ఈ లోపాన్ని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు బయటపెట్టారు. వైసీపీ అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసుకు రఘు రామకృష్ణరాజు ఎదురు ప్రశ్నలతో సమాధానం ఇచ్చారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం వైసీపీలో అసలు క్రమశిక్షణ సంఘం ఉందా అన్న అనుమానం తలెత్తింది. పార్టీ అన్నాక ఇలాంటి వ్యవస్థలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

 

 

ఏ క్రమశిక్షణ సంఘం పేరుతో తాఖీదు పంపారో చెప్పాలని ఎంపీ తన లేఖలో ప్రశ్నించారు. అంతే కాదు.. సరైన వివరాలు పంపకుంటే న్యాయపర చర్యలకు ఉపక్రమిస్తానని మరీ రాజు హెచ్చరించారు. షోకాజ్ నోటీసు అందించాలంటే రాజకీయ పార్టీకి క్రమశిక్షణ సంఘం ఉండాలన్న రఘురామకృష్ణరాజు.. తనకు ఏ క్రమశిక్షణ సంఘం పేరుతో నోటీసు పంపారో వివరాలు తెలియజేయాలని కోరారు. క్రమశిక్షణ సంఘం ఉంటే ఎన్నికల గుర్తింపు, ఛైర్మన్, సభ్యుల వివరాలు, మినిట్స్ వివరాలు పంపాలని కోరారు.

 

 

అలాగే పార్టీ పేరు పైనా రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుపై ఎన్నికల్లో విజయం సాధించానన్న ఎంపీ.. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఎలా జారీ చేస్తారని . లేఖలో ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజుకు పార్టీలో కొనసాగే ఉద్దేశ్యం లేదని పార్టీని అల్లరిపాలు చేసే ఉద్దేశ్యం ఉందని ఈ లేఖ ద్వారా అర్థమవుతోంది. కానీ.. రఘురామకృష్ణరాజు వైసీపీలోని లోపాలను గుర్తు చేశారన్న సంగతి మర్చిపోరాదు. వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం వైసీపీ అధిష్టానానిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: