డొనాల్డ్‌ ట్రంప్‌...అమెరికా అధ్యక్షుడు. ఈ ప‌దవికి  ఎన్నికైనప్పటి నుంచి  వలస విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేసిన ఆయన.. తాజాగా హెచ్‌-1బీ లాంటి వర్క్‌ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు రద్దుచేశారు. ఈ నిర్ణయం భారత ఐటీ పరిశ్రమ లాభాలకు గండి కొట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మ‌న టెక్కీలు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ త‌రుణంలో ఇండియ‌న్ల ఓట్లు కోల్పోకుండా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో ఉన్న అత్యున్న‌త న్యాయ‌స్థానానికి భార‌త సంత‌తికి చెందిన విజ‌య్ శంక‌ర్‌ను జ‌డ్జిగా నియ‌మించ‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు. 

 

వాషింగ్ట‌న్ డీసీలో కొలంబియా జిల్లా కోర్టు అత్యున్న‌త‌మైం‌ది.  న్యాయ‌శాఖ‌ నేర విభాగంలో ప్ర‌స్తుతం సీనియ‌ర్ లిటిగేష‌న్ అధికారిగా శంక‌ర్ ప‌నిచేస్తున్నారు. న్యాయ‌శాఖ‌లో చేర‌డానికి ముందు జ‌స్టిస్ శంక‌‌ర్ ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు. వాషింగ్ట‌న్ కోర్టులోని జ‌డ్జి చెస్ట‌ర్ జే స్ట్రాబ్ వ‌ద్ద శంక‌ర్‌ క్ల‌ర్క్ గా చేశారు. డ్యూక్ వ‌ర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. వ‌ర్జీనియా న్యాయ విద్యాల‌యం నుంచి జేడీ ప‌ట్టా పొందారు. వ‌ర్జీనియా లా రివ్యూకు నోట్స్ ఎడిట‌ర్‌గా చేశారు. ఒక‌వేళ ట్రంప్ ప్ర‌తిపాద‌న‌కు సెనేట్ ఆమోదం తెలిపితే అప్పుడు కొలంబియా అప్పిల్ కోర్టుకు అసోసియేట్ జ‌డ్జిగా విజ‌య్ శంక‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు. 

 

కాగా, అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2021 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసాలు పొందిన అనేక అమెరికన్‌, ఇండియన్‌ కంపెనీలకు ట్రంప్‌ సర్కారు నిర్ణయంతో ఇబ్బందులు తప్పవంటున్నారు. ‘హెచ్‌-1బీ లాంటి వర్క్‌ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేయడం భారత ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి భారత ఐటీ కంపెనీల లాభాలకు గండి కొడుతుంది. స్థానిక ఉద్యోగులను తక్కువ సంఖ్యలో నియమించుకొన్న కంపెనీలకు అధిక నష్టం వాటిల్లుతుందని మేము అభిప్రాయపడుతున్నాం’ అని గోల్డ్‌మన్‌ సాచ్‌ ఈక్విటీ రిసెర్చ్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. 2017 నుంచి భారత ఐటీ కంపెనీలు హెచ్‌-1బీ/ఎల్‌1 వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు కసరత్తు చేస్తున్నాయని, అమెరికాలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించి స్థానికులను చేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. త‌న నిర్ణ‌యం త‌న‌కుఎదురు త‌న్న‌కుండా ట్రంప్ ఈ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: