దేశంలో కరోనా విజృంభిస్తోంది. గ‌త కొద్దిరోజులుగా తెలంగాణలో ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరిగిపోయింది. ఇదే స‌మ‌యంలో అధికార టీఆర్ఎస్‌, రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. అయితే తెలంగాణ సర్కార్ తక్కువ టెస్టులు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఈ తరుణంలో నాలుగోసారి కేంద్ రబృందం రానుంది. ప్రధానంగా హైదరాబాద్ లో పరిస్థితిపై అధ్యయనం చేసి కేంద్రానికి  బృందం రిపోర్టులు ఇవ్వనుందీ. అయితే, ఈ బృందం రాష్ట్రంలోని పరిస్థితి తెలుసుకునేందుకు వ‌స్తోందా లేక‌పోతే బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారును టార్గెట్ చేసేందుకా అనే ఆస‌క్తి తెర‌మీద‌కు వ‌స్తోంది.

 

 

దేశంలో కరోనా క‌ల‌క‌లం మొద‌ల‌యిన నాటి నుంచి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తతపై... తమ టీంలను పంపి సమాచారాన్ని సేకరించింది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి సూచనలు సలహాలు ఇచ్చింది . ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నుంది. ఈనెల 29 వరకూ తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈబృందం పర్యటించనుంది. తెలంగాణ రాష్ట్రంలో పర్యటన సమ‌యంలో కరోనా వ్యాప్తి, అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పరిశీలన చేయనుంది. అనంత‌రం కేంద్రానికి నివేదిక ఇవ్వ‌నుంది.

 

 

ఇదిలాఉండ‌గా, కరోనా కేసులు ప్రారంభమయిన కొత్తలో కేంద్ర బృందం వచ్చి.. కరోనా కోసం ఎలా వార్డులు ఏర్పాటు చేయాలి, ఐసోలేషన్ , ల్యాబ్ లు పరిశీలించి వెళ్ళింది. ఆ తర్వాత ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు లాక్ డౌన్ సమయంలో తెలంగాణాలో సెంట్రల్ టీం పర్యటించి, కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై పరిశీలించింది. మరో వైపు ఐసీఎంఆర్ తెలంగాణలో సీరం సర్వే నిర్వహించింది. అయితే ఇప్పుడు మరో సెంట్రల్ టీం తెలంగాణకు వస్తోంది. తెలంగాణలోని ప‌రిస్థితుల‌పై ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుంది?  దానిపై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుందా? అనే చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: