బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వరద నీరు అసోంను ముంచెత్తుతోంది. ఏడు జిల్లాల్లోని 180 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోగా, నీట మునిగి 14 మంది మృతిచెందారు. 


 
అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో బ్రహ్మపుత్ర నది మహోగ్రరూపం దాల్చింది. పలు చోట్ల నది ప్రమాద స్థాయిని దాటి పొంగిపొర్లుతుడడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఏడు జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. తిన్సుకియాతో పాటు ధీమాజీ, లకింపూర్‌, జోర్హట్‌, మజులి, శివసాగర్‌, దిబ్రుగఢ్‌ జిల్లాల్లోని  180 గ్రామాలు నీట మునిగాయి. ఒక్క తిన్సుకియా జిల్లాలోనే 50 వేల మందికి పైగా వరదల వల్ల ఇబ్బందిపడుతున్నారు.  


  
ఓ వైపు బ్రహ్మపుత్ర పొంగుతుంటే... మరోవైపు 24 గంటల పాటు ఎడతెరపి లేకుండా వాన పడింది. దీంతో ఉత్తర అంసోంలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు రావడంతో గత్యంతరం లేని సరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు జనం. వరద తాకిడికి తిన్సుకియా జిల్లాలోని బాగజన్‌-దూమ్ ‌దూమా ప్రాంతాలను కలిపే బ్రిడ్జి నేలకూలింది. దీంతో జలదిగ్భందంలో చిక్కుకుపోయారు స్థానికులు. 

 

దిబ్రుగఢ్‌లో గడిచిన రెండు రోజుల్లో వెయ్యి మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అయితే, వాన నీరు పోయే మార్గాలు లేకపోవడం వల్ల మొత్తం నీరు  పట్టణంలోనే ఉండిపోతోందని అధికారులు చెబుతున్నారు.  సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, ఆ తర్వాత  కరోనా లాక్‌డౌన్‌ వల్ల దిబ్రుగఢ్‌ నగరంలో డ్రైనేజి ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోయాయి.  ఇప్పుడు భారీ వర్షాలతో పట్టణం పరిస్థితి  అధ్వాన్నంగా తయారైంది. 

 

భారీ  వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గడిచిన 72 గంటల్లో ఇళ్లు కూలి 24 మంది చనిపోయారు. అలాగే వరదల వల్ల  నీటమునిగి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల 13 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.    


  
గౌహతీలో కూడా బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి చేరువగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లలో ఆందోళన  నెలకొంది. ప్రస్తుతం ప్రతి గంటకు సెంటీమీటరు చెప్పున నీటి మట్టం పెరుగుతోంది. అయితే వానలు ఇలాగే కొనసాగితే మరింత వేగంగా  నీటిమట్టం పెరుగుతుందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ హెచ్చరిస్తోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందోననే ఆందోళన చెందుతున్నారు అసోం వాసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: