దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తుంటాయి.. ఆ సమయంలో నాయకులు ప్రతి ఇంటికి తిరుగుతూ.. అయ్యా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపించండి అంటారు. దానికి తగ్గ అమ్యామ్యాలు కూడా ఇస్తుంటారు.  మొత్తానికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి ముఖాలు టివి ప్రెస్ మీట్స్ లో చూడాల్సిందే తప్ప ప్రత్యక్షంగా చూడటం చాలా అరుదుగా జరుగుతుంది.  ఇది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి రాజకీయ నాయకుల విషయంలో జరుగుతున్న తంతే.. కానీ వారిలో కూడా మంచీ.. మానవత్వం చాటుకునే నాయకులు కూడా ఉన్నారు. సాధారణంగా ప్రజా ప్రతినిధి అయితే అధికారులకు, సిబ్బందికి పని చెప్పడం తనకు మాత్రం చేతికి మట్టి అంటకుండా చేసేవారిని చూసి ఉంటాం. సర్వసాధారణంగా రాజీకీయాల్లోకి వచ్చిన వారు పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి అంటుంటారు.  

 

తాజాగా  ఓ కార్పొరేటర్ మాత్రం అలా కాకుండా తానే స్వయంగా పనులు చేశాడు. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఏకంగా మ్యాన్ హోల్‌లోకి దిగి డ్రైనేజీని శుభ్రం చేశాడు. ఆయనే కాదు ఆయనతో పాటు అతని అనుచరులు కూడా దిగి మొత్తం చెత్తను ఏరివేశారు. మంగళూరు సిటీ కార్పొరేషన్‌లో ఇది జరిగింది.  బీజేపీ కార్పొరేటర్ మనోహర్ శెట్టి తన వార్డులో పర్యటించాడు. ఈ సందర్భంగా కద్రీ-కంబాలా వద్ద చెత్త కుప్పల కారణంగా వర్షాలకు అవి డ్రైనేజీలో పేరుకుపోయాయి. దీంతో నీరు వెళ్లక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

 

ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అక్కడికి చేరుకున్నారు. కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. ఇలాంటి సమయంలో  చాలా ప్రమాదకరమని లోపలికి వెళ్లడానికి నిరాకరించారు. హై స్పీడ్ వాటర్ జెట్‌తో చెత్తను తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇక పరిస్థితి అర్థం చేసుకున్న కార్పోరేటర్ మనోహర్ శెట్టి తానే స్వయంగా రంగంలోకి దిగారు.. మ్యాన్‌హోల్‌లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించారు.  అతడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: