అవును దేవుడు ఉన్నాడు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కూడా ఉంది. అందుకే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. 22 ఎంపీ సీట్లు కూడా దక్కాయి. మరి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు, చంద్రబాబుకు మొట్టికాయలు పెడతాడు. ఈ డైలాగులు ఎక్కడో విన్నట్లుగా లేదూ లేదు, అవును నిజం ఈ డైలాగులు జగన్ వి, జగన్ నోట బాంబుల్లా డైలాగులు పేలేవి, చివర్లో చంద్రబాబు సంగతి దేవుడు చూసుకుంటాడంటూ ముక్తాయింపు ఇచ్చేవారు.

 

ఇపుడు అచ్చంగా అదే డైలాగును కాపీ కొట్టి బట్టీ పడుతున్నాడు లోకేష్ బాబు. ఆయన ఇపుడు  నిమ్మాడ టూర్ వేశారు. అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు.  ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ లోకేష్ మధ్యలో దేవుడు ప్రస్తావన తెచ్చారు. ఇంతటి అరాచక పాలనను చూడలేదు, దేవుడు ఉన్నాడు జగన్, మాకు న్యాయం చేస్తాడు అంటున్నాడు.

 

అంటే జగన్ కి కూడా ఆ దేవుడు మొట్టికాయలు పెడతాడు అని లోకేష్ చెబుతున్నారన్నమాట. అయిదేళ్ల బాబు పాలన తరువాత కదా జనం విసిగి జగన్ని ఎన్నుకుంది. ఇంతలోనే ఏదో అయింది అన్నట్లుగా లోకేష్ రోడ్డు మీదకు వచ్చి అల్లల్లాడిపోవడం ఎందుకన్నది కూడా చర్చగా ఉంది. ఇంత చేసినా కూడా ఇంకా నాలుగేళ్ళు మిగిలే ఉంది.

 

ముందు నీ పని నీవు చేయాలి కదా లోకేష్. జనంలోకి వెళ్ళి సమస్యలు ఉంటే పోరాడాలి, మంచి జరిగితే మెచ్చుకోవాలి. నిర్మాణాత్మకమైన విపక్ష పాత్ర పోషించి ఆనక దేవుడు ఉన్నాడు అంటే బాగుంటుందేమో. నిన్నటి దాకా అధికారం చలాయించి ఈ రోజున పదవీవియోగం తో జగన్ రెడ్డీ దిగిపో, దేవుడున్నాడు అంటే కుదిరే పనేనా.

 

ఓపిక పట్టాలిగా. రాజకీయాల్లో సహనం అవసరం. ఇపుడు తొలి ఏడాదే గడచింది. ఇంకా మేజర్ పార్ట్ ముందుంది అంటున్నారు వైసీపీ నేతలు. ఇంతలో సినిమా అయిపోయినట్లుగానూ, నేడో రేపో ఎన్నికలు అన్నట్లుగా లోకేష్ ఆత్రపడడం ఏంటి అంటున్నారు. మొత్తానికి దేవుడున్నాడు అని జగన్ అంటే దీవించాడు, అదే బాగుందని కాపీ కొడితే దీవిస్తాడా. అయినా ఒక్క దేవుడినే జగన్ నమ్ముకోలేదుగా. జీవుడినీ నమ్ముకున్నారు. ఆ తెలివిడితో లోకేష్ ఆలోచన చేస్తే బాగుంటుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: