ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. కాన్పూర్ బాలికా సంరక్షణ గృహంలో ఉన్నవారికి గర్భం వచ్చిందని ప్రియాంక చేసిన కామెంట్స్ పై యూపీ బాలికా సంఘం ఆమెకు నోటీసులిచ్చింది. అయితే తనకు వ్యతిరేకంగా ఏం చేసుకుంటారో చేసుకోండని, తాను ఇందిరాగాంధీ మనవరాలినని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రియాంకా గాంధీ. 

 

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. తానెవరికీ భయపడనని  వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తాను ఇందిరా గాంధీ మనవరాలినేనని నొక్కిచెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ బాలికల  సంరక్షణ గృహంలో 57 మందికి కరోనా సోకింది. అందులో ఇద్దరు బాలికలు గర్భం దాల్చిన విషయం గురించి ప్రియాంక ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు  చేశారు. దీంతో యూపీ బాలల హక్కుల సంఘం ఆమెకు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు  తప్పవని హెచ్చరించింది.

 

ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. నేను వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాను. నేను ఇందిరా గాంధీ మనవరాలిని. కొన్ని  ప్రతిపక్ష పార్టీల్లోని నేతల్లా అప్రకటిత భాజపా అధికార ప్రతినిధిని కాను అని హిందీలో ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక ప్రజా సేవకురాలిగా  ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజల ముందు నిజాలను ఉంచడం తన విధి అని చెప్పారు ప్రియాంక. వేర్వేరు శాఖల ద్వారా తనను భయపెట్టాలని యూపీ  ప్రభుత్వం సమయం వృథా చేసుకుంటోందని సెటైర్లు వేశారు.  

 

కాగా సంరక్షణ గృహంలోకి రాకముందే బాలికలు గర్భం  దాల్చారని అధికారులు ఇంతకుముందే స్పష్టం చేశారు. అటు కరోనా మరణాల రేటు విషయంలో కూడా ప్రియాంక యూపీ సర్కారును తప్పుబట్టారు. ఢిల్లీ, ముంబై కంటే ఆగ్రాలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వెనక్కితీసుకోమని చెప్పినా.. ప్రియాంక తగ్గలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: