"సార్ మీ పిల్లోడిని మా బడిలో చేరిస్తే ఐదేళ్లలో మెడికల్ సీట్ వచ్చేస్తుంది." "మేడం మీ అమ్మాయిని కనుక కొత్తగా స్టార్ట్ చేసిన బ్యాచ్ లో వేస్తే ఐఐటి కాలేజీకి తీసుకువెళ్లే బాధ్యత మాది." "మీ పిల్లలని మాకు వదిలేయండి.. వారికి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే పూచి మాది." ఇక ఇలాంటి డైలాగులు రాష్ట్రంలో వినపడకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

 

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ కాంతారావు కమిషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రైవేటు స్కూళ్ళు మరియు కాలేజీల పనితీరుపై బాగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులు అడ్మిషన్ లపై దృష్టి సారించాయి.

 

సమయం దొరికింది కదా అని వారి విద్యాసంస్థల్లో లో పనిచేసే టీచర్లకు టార్గెట్ ఇచ్చి అందుకు తగ్గట్లు అడ్మిషన్లు చేయమని తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. టీచర్లు విపత్కర సమయంలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం చేస్తున్న ప్రయత్నాలను చూసి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్థుల ఇళ్ళకు పంపడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాగే పాఠశాలలు లేదా కళాశాలలో తమ సిబ్బందికి ఇచ్చే వేతనాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించడం సరికాదని తెలిపింది.

 

సదరు చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు కళాశాలల గుర్తింపు రద్దు చేయడమే కాకుండా వారిపై కమిషన్ చర్యలు కూడా తీసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలోనైనా ఇలాంటివి మళ్లీ జరిగితే apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ ద్వారా తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇకపోతే అడ్మిషన్ల పోటీ దెబ్బతో అటు టీచర్లు మరియు ఇటు విద్యార్థులు భయపడి చస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టీచర్లు అయితే తాము తమ ప్రాణాలను రిస్క్ చేసి చేసి ఎండలో తిరగవలసిన అవసరం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: