ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి జైలు శిక్ష తప్పేలా కనిపించడం లేదు. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆయన ప్రమేయానికి బలమైన ఆధారాలు లభించడమే అందుకు కారణంగా చెబుతున్నారు. ఆయన మాత్రం అబ్బే.. నేను ఒక లేఖ మాత్రమే రాశాను.. ఆ మాత్రానికే నన్ను అరెస్టు చేస్తారా.. జైల్లో పెడతారా అని వాదిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు కూడా ఇదే పాట పాడుతున్నాయి.

 

 

అయితే గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం, అచ్చెన్నాయుడి లేఖలు, సిఫారసుల వల్లే తాము నామినేషన్‌ పద్ధతిలో టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ సేవలు, మందులు, పరికరాలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్టు ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు అంగీకరించారు. వారిని ఏసీబీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. అయితే అందరూ మూకుమ్మడిగా ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది.

 

 

కేవలం అచ్చెన్నాయుడి లేఖలు, సిఫారసులు, ఒత్తిళ్ల కారణంగానే తాము అక్రమాలకు పాల్పడ్డామని వారు ఏసీబీ అధికారుల వద్ద క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్‌ జేడీ వి.జనార్దన్, సూపరింటెండెంట్‌ ఎంకేపీ చక్రవర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇవన రమేష్‌లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ.. శుక్రవారం విచారణ జరిపారు.

 

 

ఈ ఈఎస్ఐ స్కామ్ లో ఇప్పుడు అధికారుల వాదన కీలకంగా మారింది. కేవలం లేఖ రాశాను అంటూ అచ్చెన్నాయుడు చేస్తున్న వాదన నిలబడదని.. అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయనకు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే.. ఆయన కేరీర్‌తో పాటు తెలుగు దేశానికి కూడా డ్యామేజ్ జరిగినట్టే. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: