దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాధి ముదురుతున్నట్లు, త్వ‌ర‌లో మ‌రింత ఉధృతికి చేర‌నున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో తాజాగా మ‌రో షాకింగ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్రస్తుత తరుణంలో కొంతవరకు కరోనా వ్యాప్తి కొనసాగుతుందని, అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో మెడిసన్‌ అండ్‌ సర్జరీ, అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతకు కేసులు పెరుగడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా మొదటి దశ కొనసాగుతున్నదని, నవంబర్‌లో రెండో దశ ఉంటుందని తెలిపారు.

 

హైద‌రాబాద్‌లో డాక్ట‌ర్ విజ‌య్‌ మీడియాతో మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ అన్నది కేవలం టేప్‌ రికార్డర్‌లో పాజ్‌ బటన్‌ వంటిదని చెప్పారు. గుంపులుగా చేరే అవకాశం ఉన్న పెండ్లిళ్లు, శుభకార్యాలు, పూజలు, అంతిమయాత్రలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే వైరస్‌ను కొని తెచ్చుకోవడమేనని చెప్పారు. కరోనా విషయంలో భయపడవద్దని, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ సూచించారు. ప్రస్తుతం కరోనా మొదటి దశ కొనసాగుతున్నదని, జూలై నుంచి ఆగస్టు మధ్య పతాకస్థాయికి చేరుకొని ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని చెప్పారు. మళ్లీ నవంబర్‌ నెలలో రెండో దశ ప్రభావం చూపుతుందని విజ‌య్ విశ్లేషించారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా భయపడవద్దని డాక్ట‌ర్ విజ‌య్ తెలిపారు. వైరస్ ‌సోకితే మందులు తీసుకొని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దవాఖానలో కచ్చితంగా చేరాలన్న నియమం ఏదీ లేదని తెలిపారు. 

 

జ్వరం తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అతి నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని డాక్ట‌ర్ విజ‌య్ సూచించారు. హైబీపీ, మధుమేహం, కిడ్నీ వ్యాధులున్న వాళ్లు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గదిలో గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలని ఆయ‌న సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: