లదాఖ్ తూర్పు ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక  కార్యకలాపాలను నిలిపివేయాల‌ని భార‌త్ హెచ్చ‌రించింది. సైనిక బ‌లంతో యధాతథ స్థితిని మార్చడానికి య‌త్నిస్తే మాత్రం త‌ప్ప‌క మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని కాస్త ఘాటుగానే చైనా ఎంబ‌సీకి భారత రాయబారి విక్రం మిస్రీ తేల్చి చెప్పారు.  గాల్వన్ లోయలో భారత ‘సార్వభౌమాధికారాన్ని’ సహించబోమన్న చైనా రాయబారి సన్ వీడాంగ్ ప్రకటనను విక్రం మిస్రీ  ఖండించారు. చైనా చర్యలు ఉభయ దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ‌తీసేలా ఉన్నాయంటూ తేల్చి చెప్పారు. ఉభయ దేశాల సైనికాధికారుల చర్చల్లో తాము శాంతికి కట్టుబడి ఉంటామని చెప్పే చైనా మాటలకు, చేతలకు పొంతన లేదని మిస్రీ ఆరోపించారు.

 

నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తోందని భార‌త్ ఆరోపిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఓవైపు చర్చల పేరుతో సైన్యం వెనక్కి తీసుకునేందుకు అంగీకరిస్తూనే.. మరో వైపు సరిహద్దుల్లో వేలమందిని మోహరిస్తున్న చైనా వైఖరికి నిరసనగా భారత్ గురువారం గట్టి హెచ్చరిక ఇచ్చింది. తూర్పు లఢఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించానికి చేసుకున్న అవగాహనను అమలు చేయడంలో విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాజాగా భారత్ హెచ్చరించింది. ఇలాగే కొన సాగితే ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

 


భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. బోర్డర్‌లో ఘర్షణ కారణంగా మన సైనికులు 20 మంది అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడేలా ఉంది. చైనాకు ఇండియా గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండ‌గా చైనా నుంచి మన దేశంలోని దిగుమతులను తగ్గించుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నారు. కఠినమైన నాణ్యతా నిబంధనలు, అధిక టారిఫ్‌ల విధింపుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని చూస్తోందని తెలిపాయి. ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఇప్పటికే 370 ప్రొడక్టులతో ఒక జాబితాను రూపొందించిందని, వీటికి కఠినమైన నాణ్యత ప్రమాణాలు నిర్దేశించనుందని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: