ఈ మద్య సైబర్ మోసగాళ్లు ప్రతిదాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లూప్ లైన్స్ వెతికి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ సమయంలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నారు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ళు కూడా లాక్‌డౌన్ ను ఆసరాగా వాడుకుంటున్నారు.‌ కరోనా భయంతో ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ పై మొగ్గు చూపుతున్నారు. దాంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మాస్కుల పేరుతో రూ. 30 లక్షలు దోచేశారు. ఇండియా మార్ట్‌ అనే సైట్‌లో హోల్‌సేల్‌ ధరలకే మాస్కులు, గ్లౌజ్‌లు అందజేస్తామంటూ హంగేరి దేశానికి చెందిన ఓ కంపెనీ పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ఇటీవల ప్రకటన జారీ చేశారు. ధరలతో పాటు ఒక కొటేషన్‌ ఉంచారు.  

 

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించడం తప్పని  సరి అయ్యింది.. దీనికి పేదా ధనిక అనే తేడా లేదు.  మాస్క్ లేకుండా బయట తిరిగితే కఠిన శిక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మాస్క్ తప్పని సరిగా వాడుతున్నారు. ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. గ్లౌజ్‌, మాస్కులను హోల్‌సేల్‌లో విక్రయించే జూబ్లీహిల్స్‌లోని ఓ సంస్థ ఈ ప్రకటనపై ఆసక్తి కనబరిచింది. దీంతో సదరు హంగేరీ కంపెనీని సంప్రదించింది. ఇద్దరూ కొటేషన్లు ఇచ్చి పుచ్చుకున్నారు. హంగేరి కంపెనీ ప్రతినిధిగా పరిచయమైన వ్యక్తి వాట్సాప్‌ ద్వారా అగ్రిమెంట్‌ పంపించాడు.

 

సంస్థ యాజమాన్యం సంతకాలు చేసి తిరిగి వాట్సాప్‌లో పంపించింది. సరకు పంపించాలంటే 50శాతం పేమెంట్‌ చేయాల్సి ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధి చెప్పాడు. జూబ్లీహిల్స్ లోని ఓ కంపెనీ యాజమాన్యం హంగేరిలోని ఓ బ్యాంక్‌ ఖాతాకు సుమారు రూ.30 లక్షలు బదిలీ చేశారు. ఇక ఇచ్చిన గడువుకు మాస్క్ లు రాలేదు సరికాదా అక్కడ నుంచి ఎలాంటి రిప్లై కూడా రాలేదు. దీంతో జూబ్లీహిల్స్‌ కంపెనీ యాజమాన్యం మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే హైదరాబాద్‌ సైబర్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: