ఆషాఢ మాసం బోనాల జాతర వచ్చేసింది. ఈ సారి జరుగుతున్న బోనాల పండగలో కరోనా ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో పాతబస్తీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కరోనా కారణంగా బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతుంది.

 

ఆషాఢమాసం అంటే హైదరాబాద్‌లో బోనాల పండుగే గుర్తొస్తోంది. నెలపొడవునా జరిగే బోనాలతో జంటనగరాలు పులకిస్తాయి. ఏ గల్లీ చూసినా... బోనాల సందడే కన్పిస్తుంటుంది. భక్తుల మొక్కులు, పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల నృత్యాలు...ఇలా సందడే సందడిగా ఉంటుంది ఆషాఢమాసం మొత్తం. 

 

తెలంగాణ ఏర్పడిన అనంతరం బోనాల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించి తగిన ఏర్పాట్లు చేస్తోంది. పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. నగరంలోని భక్తులే కాకుండా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తారు. ఈ ఘటాల ఊరేగింపులో కళాకారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు దిగ్విజయంగా కొనసాగుతూ వస్తున్న బోనాల పండుగ ఈ సారి కళ తప్పింది. ఈసారి ఇవేవీ లేకుండా సాదాసీదాగా జాతరలు నిర్వహిస్తున్నారు. 

 

కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో... ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు సిద్ధమైయ్యారు. కోవిడ్‌19 వైరస్‌ ప్రభావం కారణంగా.. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామంటున్నారు నిర్వాహకులు. ఒకవేళ లాక్‌డౌన్‌ సడలిస్తే.. గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ బ్యాండ్, మేళాలు, కళాకారుల నృత్యాలు, డీజేలు లేకుండా ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నాలుగైదు రోజులుగా శ్రీ భాగ్యనగర్‌ బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి.

 

ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇళ్ళలోనే మొక్కులను చెల్లించుకోవాలని అధికారులు సూచించారు. బయట ఘటాల ఊరేగింపులను నిషేధించారు. ఆలయాల్లో బోనాల నిర్వహణను పూజారులు మాత్రమే చేయనున్నారు. ఈ బోనాల ఉత్సవాలను గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభించడం, ఆఖరి బోనం పూజను కూడా అక్కడే నిర్వహించడం సంప్రదాయం. తొలి బోనం పూజను గురువారం నిర్వహించారు. జూలై 23న ఆఖరి పూజ ఉంటుంది. ఈ వేడుకల్లో గరిష్ఠంగా పదిమందిని మాత్రమే అనుమతించనున్నారు. 

 

ఇక పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారి ఆలయంలో కూడా ఈనెల 25 నుంచి వేడుకలు మొదలయ్యాయి. జూలై 19న బోనాలు జరుగుతాయి. సామూహికంగా కాకుండా ఎవరికివారు బోనాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే నెల రోజుల పాటు ప్రతిరోజూ బోనాల సమర్పణకు వీలు కల్పిస్తున్నారు.

 

ఈ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో శుక్రవారం నుంచి బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. జూలై 19న అమ్మవారికి బోనాల సమర్పణ, 20న రంగంగా పిలవబడే భవిష్యవాణి నిర్వహిస్తారు. ఈ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి ఆలయం వద్ద బోనాలు జూలై 12న, రంగం 13న జరుగుతాయి. 

 

బోనాల ఉత్సవాలను ఆషాఢం పూర్తిగా జరుపుకోవచ్చని, ప్రతి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించవచ్చని పండితులు సూచించటంతో ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులకు తప్పని సరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, మాస్కు, శానిటైజర్స్, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున బోనాల పండుగలో మునుపటి ఉత్సాహం కొరవడింది. కళాకారుల నృత్య ప్రదర్శనలు లేక, డప్పుసప్పుల్లు లేక అతి కొద్ది మందితోనే ఉత్సవాలు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: