చైనాకు భార‌త్ ధీటుగా స‌మాధానం ఇవ్వ‌డం లేద‌ని స‌రిహ‌ద్దులో జ‌రుగుతున్న వివాదం గురించి..సైనిక దాడి గురించి రాహుల్ గాంధీ ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోదీని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తునే ఉన్న విష‌యం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఓ అడుగు ముందుకేసి ప్ర‌ధాన‌మంత్రి మోదీ చైనాకు స‌రెండ‌ర్ అయ్యిన‌ట్లు ఉన్నారంటూ కామెంట్ చేసేశారు. దీనిపై బీజేపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్‌కు చెందిన కీల‌క నేత‌లుకూడా ఆఫ్ ది రికార్డులో రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. అంతేకాక రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌తో పార్టీ ఇర‌కాటంలోనే ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని సీనియ‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు.

 

 ఇదిలా ఉండ‌గా రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో ఆ పార్టీతో పొత్తుతో ఉన్న ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ స్పందించారు. రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్ట‌డ‌మే కాకుండా కాంగ్రెస్ పార్టీ గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు చైనా దురాక్ర‌మ‌ణ‌ను అడ్డుకోలేక‌పోయింద‌ని, ఆ త‌ర్వాత కాలంలో కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురైన భూ భాగాన్ని విడిపించలేక‌పోయింద‌ని అన్నారు. అవ‌త‌లి వారిపై విమ‌ర్శ‌లు చేసే ముందు మ‌నం ప‌వ‌ర్‌లో ఉన్న‌ప్పుడు ఏం జ‌రిగిందో గుర్తుంచుకోవాలి. 1962 వార్ త‌ర్వాత దాదాపు 45 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌ భార‌త భూభాగాన్ని చైనా ఆక్ర‌మించింది. అది ఇప్ప‌టికీ ఆ దేశం ఆధీనంలోనే ఉంది. గ‌తంలో అంతటి భారీ స్థాయిలో జ‌రిగిన దురాక్ర‌మ‌ణ‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేం అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తకుండా నాటి సంఘ‌ట‌న‌ల్ని గుర్తు చేశారు. 

 

ఇప్పుడు కొత్త‌గా చైనా ఏమైనా మ‌న భూభాగాన్ని ఆక్ర‌మించిందా లేదా అన్న‌ది త‌న‌కు తెలియ‌ద‌ని, అయితే ఒక‌రిపై విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు మ‌న టైమ్‌లో ఏం జ‌రిగింద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. ఇదిలా ఉండ‌గా జూన్ 15న రాత్రి తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం చేయ‌డంతో భార‌త బ‌ల‌గాలు అడ్డుకున్నాయి. ఆ స‌మ‌యంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రుల‌య్యారు. అయితే భార‌త సైనికులు దీటుగా చైనా ఆర్మీని త‌రిమికొట్టార‌ని, దాదాపు 40 మందికి పైగా చైనా సైనికులు మ‌ర‌ణించార‌ని నాడు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: