జగన్‌పై సెంట్రల్ బీజేపీ రివర్స్ అవుతుందా? అంటే తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని టీడీపీతో పాటు రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం జగన్‌తో సఖ్యతగానే నడుచుకుంటూ వచ్చారు. జగన్ కూడా కేంద్ర ప్రభుత్వంతో మంచి సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వచ్చారు.

 

తాజాగా మాత్రం నిర్మలా సీతారామన్ జగన్ ప్రభుత్వంపై ఊహించని విధంగా విమర్శలు చేశారు. విద్యుత్ ఛార్జీలు, పెట్టుబడులు విషయంలో ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం యూనిట్ విద్యుత్ రూ.2.70కే ఇస్తుంద‌ని... కానీ, ఏపీలో యూనిట్‌కు రూ.9 ఛార్జ్ చేస్తుందని మండిపడ్డారు. ఇక కేంద్ర మంత్రి విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తూ...నిర్మలా వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కొట్టిపారేస్తున్నారు.

 

అయితే కేంద్రం కూడా జగన్‌పై రివర్స్ అవ్వడానికి పెద్ద ప్లాన్ ఉందని విశ్లేషుకులు భావిస్తున్నారు. ఏపీలో టీడీపీకి ఎలాగో చెక్ పెట్టేశారు కాబట్టి, నిదానంగా వైసీపీకి కూడా చెక్ పెట్టేందుకు ఇలా రివర్స్‌లో వస్తున్నారని అంటున్నారు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా...ఏపీలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారని, వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతున్నారు.

 

పైగా రాష్ట్రంలో బీజేపీ అంతర్గతంగా సర్వేలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో బీజేపీ పరిస్థితి మెరుగు కాకపోయినా, వైసీపీ మాత్రం రోజురోజుకూ ప్రజాధరణ కోల్పోతుందని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అసలు టీడీపీ అయితే మరీ క్షీణిస్తుందని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసుకుని బీజేపీ రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ బీజేపీ చేతిలో బాబు బుక్ అయినట్లు, జగన్ అవ్వడం కష్టమే అని విశ్లేషుకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: