కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఈడీ విచారించింది. సందేశారా స్కామ్ కు సంబంధించి ఆయనపై ప్రశ్నలు సంధించింది. విచారణకు రావాలంటే అహ్మద్ పటేల్ కరోనాను సాకుగా చూపడంతో.. ఈడీ బృందమే ఆయన ఇంటికి వచ్చి విచారించింది. 14 వేల కోట్ల విలువైన ఈ స్కామ్ లో సందేశారా బ్రదర్స్ తో అహ్మద్ పటేల్ కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది.

 

సందేశారా కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఈడీ ప్రశ్నించింది. బ్యాంకులను మోసగించిన కేసులో సందేశారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ డైరక్టర్లను ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో అహ్మద్ పటేల్ పేరు వెలుగు చూసింది. దీంతో సందేశారా బ్రదర్స్‌తో ఉన్న సంబంధాలపై అహ్మద్ పటేల్‌ను ఆయన ఇంట్లోనే విచారించింది ఈడీ. 

 

స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్, ఆ గ్రూపు ప్రధాన ప్రమోటర్లయిన నితిన్ సందేశారా, చేతన్ సందేశారా, దీప్తి సందేశారాలు.. బ్యాంకుల్ని 14 వేల 500 కోట్ల మేరకు మోసగించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకుని.. ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఒకరిని ఈడీ ప్రశ్నించనప్పుడు అహ్మద్ పటేల్ పేరు వెల్లడించారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖి పేర్లు సైతం బయటకు వచ్చాయి. ఆ సాక్ష్యం ఆధారంగా ఈడీ అధికారులు అహ్మద్ పటేల్‌ను ఇంటరాగేట్ చేసేందుకు పలు ప్రశ్నలు సిద్ధం చేశారు. సందేశారా బ్రదర్స్‌తో ఆయనకు గల సంబంధాలపై ఆరా తీశారు.

 

 జూన్ మొదటి వారంలో తమ ముందు హాజరుకావాలని అహ్మద్ పటేల్‌ను ఈడీ కోరింది. ఆ వెంటనే అహ్మద్ పటేల్ తన అశక్తతను తెలియజేస్తూ ఈడీకి లేఖ రాశారు. 65 ఏళ్ల వయోభారంతో పాటు, కరోనా వైరస్ ముప్పు కూడా ఉన్నందున ఈసారికి తనను హాజరు నుంచి మినహాయించాలని కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తాను ఇంట్లోనే ఉంటున్నట్టు చెప్పారు. దీంతో ఇంట్లోనే ఇంటరాగేట్ చేసేందుకు తాము వస్తామని ఈడీ ఆయనకు తెలియజేసింది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన స్కామ్ కంటే.. సందేశారా బ్రదర్స్ కుంభకోణం పెద్దదని ఈడీ అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: