లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో తండ్రీ కొడుకుల ఉసురుతీసుకున్నారు తమిళనాడు పోలీసులు. కలప షాపును సకాలంలో మూసివేయలేదని తండ్రిని... అతన్ని విడిపించడానికి వచ్చిన కొడుకును అరెస్ట్‌ చేసి కుళ్లబొడిచారు ఖాకీలు. తండ్రీకొడుకులు చనిపోవడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. ప్రభుత్వ తీరుపై సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు సెలబ్రిటీలు. 

 

తమిళనాట తండ్రీకొడుకుల కస్టోడియల్‌ డెత్‌ దుమారం రేపుతోంది. ఈ నెల 19న లాక్‌డౌన్‌ నిబంధనలు  ఉల్లంఘించారంటూ తూత్తుకుడి జిల్లా సాతంకుళంకు చెందిన కలప షాపు యజమాని 63 ఏళ్ల  జయరాజ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. రాత్రి 9 గంటల దాటే సరికి అతను షాపును మూయలేకపోవడమే  దీనికి కారణం. మరోవైపు... విషయం తెలిసి తండ్రిని విడిపించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు జయరాజ్‌  కొడుకు 31 ఏళ్ల ఫెనిక్స్‌. అయితే, మొబైల్‌ ఫోన్ల వ్యాపరం చేసే ఫెనిక్స్‌పైనా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు  పోలీసులు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు... కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల్ని లాకప్‌లో కుళ్లబొడిచారు.  మరుసటి రోజు తండ్రీని విడిపించేందుకు స్టేషన్‌కు వెళ్లిన కొడుకునూ అరెస్టు చేశారు.

 

తండ్రీ కొడుకుల్ని కొట్టి చంపిన 13 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు.  తూతుక్కుడి,  ఉడుంగుడి, పాకాళం, సాతంకుళం ప్రాంతాల్లో  స్వచ్ఛంద బంద్ పాటించారు. దీంతో స్పందించిన మద్రాస్‌ హైకోర్టు... మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది.  

 

తూత్తుకూడి ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా స్పందించారు. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు. బాధితుల కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేసిన రాహుల్‌... వాళ్లకు న్యాయం చేయాలని తమిళనాడు సర్కార్ని డిమాండ్‌ చేశారు.

 

తండ్రీకొడుకుల కస్టోడియల్‌ డెత్‌పై సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. సుచీ లీక్స్‌ సుచిత్ర, రాశిఖన్నా, హన్సిక, జయం రవి, జీవా తదితరులు జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో కామెంట్స్‌  పోస్టు చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు డీఎంకే ఎంపీ కనిమొళి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించి, బాధ్యులైన అధికారుల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: