హైద‌రాబాద్ ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ మరింత తగ్గించేందుకు క‌స‌ర‌త్తులు కొన‌సాగుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేయడంతోపాటు పెద్ద ఎత్తున రహదారుల విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని , ప్రయాణ దూరాన్ని, సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నాలుగు ప్యాకేజీలుగా రూ. 313.65కోట్లతో 44.63కిలోమీటర్ల పొడవున 37 లింకురోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జూలైలో కొన్ని లింకురోడ్లు అందుబాటులోకి రానున్నాయి. వాటి పనులు తుదిదశకు చేరుకున్నాయి.

 

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ సంయుక్త అధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం- జాతీయ రహదారి నంబర్‌-65, కూకట్‌పల్లి జోన్‌లో హైటెన్షన్‌ లైన్‌ - మియాపూర్‌ రోడ్డు, ఖైరతాబాద్‌ జోన్‌లో జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌ రోడ్‌ నంబర్‌-70 - జూబ్లీహిల్స్‌ నార్నే రోడ్‌ నంబర్‌-78, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నెక్నంపూర్‌ రోడ్‌ - ఉస్మాన్‌ఘడ్‌ రోడ్డు తదితర నాలుగు  రహదారులు అందుబాటులోకి రాగా, మిగిలిన వాటి పనులు కొనసాగుతున్నాయి. 

 

కాగా, ప్యాకేజీ-ఏ1లో భాగంగా రూ. 79.87కోట్ల వ్యయంతో  11.6 కిలోమీటర్ల  లింకురోడ్ల నిర్మాణం చేపట్టారు. ప్యాకేజీ-ఏ2లో భాగంగా రూ. 76.30కోట్లతో 10.84 కిలోమీటర్లు, ప్యాకేజీ-బీ1లో రూ. 91.02కోట్లతో 9.55కిలోమీటర్లు, ప్యాకేజీ-బీ2లో రూ. 66.44కోట్లతో 12.64 కిలోమీటర్ల మేర  రహదారులను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్త‌యితే, పెద్ద ఎత్తున ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌గ్గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. శేరిలింగంపల్లి జోన్‌లో లింక్‌ రోడ్డు పనులను మేయ‌ర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లింక్‌ రోడ్డు పనులు జులై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ఆమోదం లభించాక అండర్‌ బ్రిడ్జి పనులు చేపడతామన్నారు. నాలుగు ప్యాకేజీలుగా 44.63 కిలోమీటర్ల మేర 37 లింక్‌ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: