మన మధ్యలోనే భారత రత్నాలు ఉన్నాయి. మనం కూడా వారి సమకాలీనులమే. అయితే వారు ఉన్నప్పటి కంటే పోయిన తరువాత విలువ ఎక్కువ. వారు ఉన్ననాడు రత్నాలు అనుకోలేకపోయాం. ఇపుడు వెనక్కి చూస్తే వారిని మించిన వారు ఉంటారా అనిపించకమానదు. అటువంటి వజ్ర‌ సమానుడు భారత మాత ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయనే పీవీ. మన భారత దేశానికే ఠీవీ.

 

ఈ దేశాన్ని ఎందరో ప్రధానులు ఏలారు. కానీ బహుముఖీయమైన ప్రతిభాపాటవాలు కలిగిన రాజకీయ చాణక్యుడు పీవీ లాంటి వారు మాత్రం ఒక్కరే ఉంటారు. ఆయన ఒక విధంగా దేశం కోసమే బతికారు. కాంగ్రెస్ ని విడవకుండా తానున్న చెట్టును చల్లగా ఉండేలా చేశారు, చూశారు, ఫలితం చివరి రోజుల్లో ఆ చెట్టు నీడే ఆయనకు లేకుండా చేశారు.

 

అంతటి అపర మేధావి, రాజనీతిమంతుడు కూడా దిగాలుపోవాల్సివచ్చింది. సరే చరమాంకం వదిలేస్తే ఆయన విలువ ఎపుడూ తగ్గలేదు. ఆయన్ని గుర్తించని వారు వట్టి వేరుగానే మిగిలిపోయారు. పీవీ ఈ దేశానికి ఏమిచ్చారు అంటే నెహ్రూ తొలి ప్రధానిగా ఒక దోవలో నడిపిస్తే అర్ధం దశాబ్దం తరువాత అది కాదు  మన దారి మరో వైపు ఉందని చూపించి మరింతగా భారత్ వెలిగిపోయేలా చేసిన మాననీయుడు మహనీయుడు పీవీ.

 

పీవీ తన శిష్యుడు మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా చేసారు. తరువాత కాలంలో ఆయన ప్రధానిగా ఈ దేశానికి పదేళ్ళు పనిచేసారంటే అది నాడు పీవీ అన్వేషణ ఫలితం అని చెప్పాలి. పీవీ ఎక్కని ఎత్తులు లేవు. అసలు ఆయనే శిఖర సమానుడు. ఆయనలోని లోపలి మనిషి బహు గొప్పవాడు. ఆయన రాసుకున్న ఇన్సైడర్ పుస్తకం పీవీ లోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.

 

ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా, అంతకు ముందు పలు కీలక శాఖలు నిర్వహించిన మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్ళి రాణించిన తెలుగు బిడ్డ ఆయనే. విదేశాంగ మంత్రిగా పీవీ దేశం ఖ్యాతిని చాటారు. మానవ వనరుల శాఖ మంత్రిగా మరింతగా దేశ ప్రగతిని విస్తరించారు. ప్రధానిగా అయిదేళ్ళు పాలించి దేశానికి దశ దిశ చూపారు.  పీవీ లాంటి వారు అరుదుగా పుడతారు. ఆయన కారణ జన్ముడు.

 

ఆయన ఎందుకు పుట్టారన్నది ఈ రోజు దేశం ఆర్ధిక సంస్కరణ బాటన పరుగులు తీయడాన్ని  చూస్తే అర్ధమవుతుంది. పీవీ చాణక్యంతోనే బంగారం కుదువ బెట్టుకున్న దేశం మళ్లీ బంగారంగా వికసించింది. ఆ మహానేత జయంతి ఈ రోజు. ఆయనకు భారత దేశం మొత్తం ఘనంగా నివాళి అర్పిస్తోంది. ఆయనకు భారత రత్న ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది ఆయనకు కాదు, ఆ పురస్కారానికే గౌరవం కాబట్టి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: