గత 50 రోజులుగా భారత్ చైనా వివాదానికి సంబంధించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. రెండు వారాల క్రితం ఇరు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో చైనాకు భారత్ వరుస షాకులు ఇస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు చైనాతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. చైనా వస్తువుల బహిష్కరణ దిశగా అడుగులు పడుతున్నాయి. 
 
ఇప్పటికే చైనా వస్తువులను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులకు అభిమానులు లేఖలు రాశారు. హోటల్స్ యూనియన్ ఢిల్లీలోని హోటల్స్ లో చైనీయులకు అనుమతి లేదని కీలక ప్రకటన చేసింది. అయితే ఇదే సమయంలో చైనాకు భారీ షాక్ ఇచ్చేలా ఇండియన్ ట్రేడ్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ట్రేడ్ యూనియన్ జులై 15 నుండి చైనా వస్తువులను బ్యాన్ చేస్తూ అమరులకు నిజమైన నివాళి అర్పిస్తామని పేర్కొంది 
 
ప్రస్తుతం 500 రకాల చైనా వస్తువులపై ట్రేడ్ యూనియన్ బ్యాన్ విధించనుందని సమాచారం. 2021 జూన్ 15 నాటికి లక్ష కోట్ల విలువైన చైనా వస్తువులను బ్యాన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇండియన్ ట్రేడ్ యూనియన్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మరోవైపు ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గి శాంతి నెలకొనాలంటే చైనా వైఖరిని మార్చుకోవాలని భారత్ స్పష్టం చేసింది. 
 
భారత రాయబారి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొత్త నిర్మాణాలను ఆపాలని.... అప్పుడే భారత్ పూర్తిస్థాయిలో బలగాలను ఉపసంహరించుకోవడం జరుగుతుందని తేల్చి చెప్పారు. చైనా భారత్ భూభాగంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వాస్తవాధీన రేఖ నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాలని సూచనలు చేశారు. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు చైనా కుట్రలకు తెగబడుతూ ఉండటంతో భారత్ డ్రాగన్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: