ఏపీలో జగన్ సర్కార్ రేషనలైజేషన్‌ పేరిట భారీగా టీచర్‌ పోస్టులను రద్దు చేయనుందా....? టీచర్‌ పోస్టులను తగ్గించనుందా...? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ టీచర్ల సంఖ్యను తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రేషనలైజేషన్‌ ప్రతిపాదనల వల్ల ప్రభుత్వరంగ స్కూళ్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. రేషనలైజేషన్ ప్రక్రియపై టీచర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
టీచర్ల్ రేషనలైజేషన్‌ ప్రతిపాదనల ప్రకారం ఇకపై విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా సరే కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారు. ప్రాథమిక స్కూళ్లలో 1 : 30 నిష్పత్తిలో 60 మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లను మాత్రమే నియమిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాల్సిన ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 80 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక స్కూళ్లలో ప్రస్తుతం 5 పోస్టులు ఉండగా తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై మూడు పోస్టులే ఉంటాయి. 
 
ప్రస్తుతం 130 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే మాత్రమే ప్రాథమిక స్కూళ్లలో హెడ్మాస్టర్‌ పోస్టు ఉండగా ఇకపై 150 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటేనే హెడ్మాస్టర్ పోస్టును మంజూరు చేస్తారు. తాజా ప్రతిపాదనల్లో మొత్తం విద్యార్థులను ఒకే మీడియంగా పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం పోస్టులు మంజూరు చేయనుందని తెలుస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో 500 విద్యార్థులు దాటిన చోట రెండవ హెచ్‌ఎం పోస్టు ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఒకే పోస్టుకు కుదించింది. 
 
గతంలో ఇంగ్లీషుతో పాటు మైనారిటీ మీడియానికి ప్రత్యేక టీచర్లు ఉన్నారు. ప్రస్తుత ప్రతిపాదనల్లో అవి కూడా తొలగించడం గమనార్హం. ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా భారీగా పోస్టులు తగ్గనున్నాయని తెలుస్తోంది. రేషనలైజేషన్‌ పేరుతో ప్రాథమిక స్కూళ్లలో టీచర్‌ పోస్టులను తగ్గించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పుడు పోస్టులను తగ్గించడం వల్ల ప్రమాణాలు పడిపోతాయని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: