ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా క‌రోనా క‌ల‌క‌లంకొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే స‌మ‌యంలో కొంద‌రు త‌మ తప్పొప్పులు, దుర్మార్గాలు కొన‌సాగిస్తున్నారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల స్కూళ్లు, కాలేజీలు మూతబడ‌టంతో విద్యార్థులకు టీచర్లు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. అయితే, సైబర్‌ నేరగాళ్ల చర్యలతో ఆన్‌లైన్‌ క్లాసులు కూడా సజావుగా సాగడం లేదు. దుర్మార్గులు త‌మ త‌ప్పుడు ప‌నులు కొన‌సాగిస్తూనే ఉన్నారు.

 

కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌ అవుతున్నాయి. అందులో విద్యాబోధన కూడా చేరింది. బడి గంటలు ఇంట్లో మోగుతున్నాయి. పాఠశాల వాతావరణంతో కళకళలాడుతున్నాయి.  స్కూల్‌ మాదిరిగానే విద్యార్థులు సమయానికి తయారై.. మొబైల్స్‌, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చొని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారు. అచ్చం పాఠశాలలో ఉన్నట్లుగానే టైం టేబుల్‌ నిర్ణయించుకుంటూ.. విద్యాబోధన సాగిస్తున్నారు. మొత్తంగా అకాడమిక్‌ నష్టాన్ని భర్తీ చేస్తున్నారు.  అయితే ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణ మంచి విధానమే అయినా ఇందులో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. 

 

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటుగా కోల్‌కతాలో ప‌లు సంచ‌ల‌న ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్న సమయంలో అన్‌లైన్‌ స్క్రీన్‌లలోకి దుండగులు చొరబడుతూ.. అశ్లీల వీడియోలు, మెసేజీలతో ఇటు విద్యార్థులను, అటు టీచర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ రెండు న‌గ‌రాల్లో ఇటీవల ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. దీంతో ఆయా పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలను కొన్ని రోజులపాటు వాయిదా వేశాయి.సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే.. టీచర్లు, స్కూల్‌ యాజమాన్యాలు సైబర్‌ భద్రతా నియమాలు పాటించాలని సైబర్‌ భద్రతా నిపుణుడు పవన్‌ దుగ్గల్‌ తెలిపారు. అథెంటికేటెడ్‌ (ప్రామాణికమైన) హోస్ట్‌ సర్వర్లు, నమ్మదగిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌ల నుంచే ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలని సూచించారు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణ మంచిదేన‌ని అయితే, విద్యార్థులు ఇబ్బందులు ప‌డ‌కుండా క్లాసులు నిర్వ‌హించాల‌ని సూచిస్తున్నారు. విద్యార్థుల‌ను ఏదో ఒక ఆక్టివిటీలో ఉంచేలా ఆన్‌లైన్‌ క్లాస్‌లు మేలు చేస్తాయని అయితే, సాంకేతిక స‌మ‌స్య‌లు సైతం దృష్టిలో ఉంచుకోవాల‌ని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: