క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్నారు. అంత‌లా.. ఈ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో కూడా ఎన్నడూ ప్రపంచం ఇంతలా భ‌య‌ప‌డ‌లేదేమో. కానీ, కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి క‌రోనాకు భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాట‌గా.. మ‌ర‌ణాల సంఖ్య ఐదు ల‌క్ష‌లు దాటేసింది. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది. 

 

మ‌రోవైపు ఈ కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. లక్షలాది పారిశ్రామిక సంస్థలు మూత పడ్డాయి. పాఠశాలలు, క్లబ్‌లు, పబ్‌లు, సినిమాహాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన , ఏరోజుకారోజు ఆదాయంతో జీవించే వారు రోడ్డునపడ్డారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా గురించి కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నారు. సాధార‌ణంగా క‌రోనా పుట్టింది ఎక్క‌డా అంటే.. ట‌క్కున చైనా అంటారు. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో షాకింగ్ విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. దీని ప్ర‌కా‌రం.. క‌రోనా వైరస్‌ను మొట్టమొదటి సారి గుర్తించింది స్పెయిన్‌లోనని అంటున్నారు బార్సిలోనా వర్సిటీ పరిశోధకులు. 

 

ఓ పరిశోధన ఫలితంగా ఈ విషయం తెలిసిందని వారు అంటున్నారు. గత ఏడాది మార్చి 12న స్పెయిన్‌లో ల‌భ్య‌మైన‌ మురుగునీటిలో క‌రోనాను క‌నుగొన్నామ‌ని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై గత ఏడాది డిసెంబర్‌లో డబ్ల్యూహెచ్‌వోకు చైనా వివరాలు వెల్ల‌డించింది. కానీ, స్పెయిన్ పరిశోధకులు అక్క‌డి వివిధ నగరాల నుంచి మురుగునీటి నమూనాలను 2018 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య వేర్వేరు తేదీల్లో సేక‌రించార‌ట‌. వీటిల్లోనే వైరస్‌కు సంబంధించిన‌ జన్యు పదార్థాన్ని గుర్తించినట్లు పరిశోధకులు అంటున్నారు. అలాగే మురుగు నీటిలో ఈ శాంపిల్‌ను గత ఏడాది మార్చి 12నే సేక‌రించినట్లు పరిశోధకులు వివరించారు. అయితే ఈ పరిశోధనపై ఇంకా స‌మీక్ష జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: