చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరని అడిగితే....అందరూ నారా లోకేష్ పేరు చెప్పేస్తారు. ఇప్పటికే చంద్రబాబు వయసు మీద పడుతుండటంతో చినబాబాబు పార్టీలో లీడింగ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అసలు చినబాబుకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతోనే, 2014 ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి అప్పగించారు. అయితే అప్పుడు లోకేష్ మంత్రిగా పనితీరు ఎలా ఉన్నా, ఆయన మాట తీరు వల్ల మాత్రం పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది.

 

అయితే అప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ...లోకేష్‌ని ఆటలో అరటిపండు మాదిరిగా తీసేసి మాట్లాడేది. అసలు లోకేష్‌ని పెద్ద నాయకుడుగానే చూడలేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు, లోకేష్ కూడా ఓటమి పాలైన తర్వాత నుంచే లోకేష్ కాస్త సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై దూకుడుగానే విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశాల్లో కూడా తడబడకుండానే మాట్లాడుతూ, అధికార పార్టీకి కౌంటర్లు ఇస్తున్నారు.

 

తాజాగా అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌ల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తెగ ఫైర్ అయ్యారు. అలాగే ఆ నేతల ఇళ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రెస్ మీట్లు పెట్టి మరీ, జగన్ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇచ్చారు. అయితే లోకేష్‌లో మార్పు బాగానే వచ్చిందని వీటి బట్టే అర్ధమవుతుంది. కాకపోతే ఎప్పుడు లోకేష్‌ని లైట్‌గా తీసుకుని, విమర్శలు చేసే విషయంలో వ్యంగ్యంగా స్పందించే వైసీపీ నేతల్లో కూడా ఇప్పుడు మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

 

లోకేష్‌ని ఓ సీరియస్ పొలిటీషయన్‌గా పరిగణలోకి తీసుకుని, ఆయనపై విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. లోకేష్ జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసిన, వెంటనే వైసీపీ నేతలు బయటకొచ్చి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిరోజూ ఎవరోకరు లోకేష్‌పై విమర్శలు చేయకుండా ఉండటం లేదని, మొత్తానికైతే వైసీపీ నేతలు...లోకేష్‌ని నాయకుడుగా పైకి లేపుతున్నారని చెబుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: