ఎట్టకేలకు పంచాయితీ భవనాలకు వేసిన పార్టీ రంగులపై జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో తాజాగా సీఎం జగన్ పంచాయితీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తీసేసి తెలుపు రంగు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రంగులు తీసి, కొత్త రంగు వేయడానికి 14వ ఆర్ధిక సంఘం నిధులని వినియోగించాలని ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో రాత్రికి రాత్రే గ్రామ సచివాలయాలకు ఉన్న వైసీపీ రంగులు పోయి తెలుపు రంగు వచ్చేసింది.

 

రంగులు తీసేసిన సచివాలయంపై ఉన్న సీఎం బొమ్మ మాత్రం ఉంచాలని ప్రభుత్వం చెప్పడంతో, వాటిపై జగన్ బొమ్మ అలాగే ఉంది. అయితే సీఎం బొమ్మ ఉంచడం, 14వ ఆర్ధిక సంఘం నిధులు కూడా వాడటం తప్పు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. కేంద్రం స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం నేరమని, ఆ నిధులు గ్రామాల అభివృద్ధికే వెచ్చించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

 

వాస్తవానికి టీడీపీ చేస్తున్న డిమాండ్ కరెక్ట్ అని విశ్లేషుకులు అంటున్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం సచివాలయంపై సీఎం బొమ్మ కూడా ఉండకూడదని, అలాగే గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులని రంగులు వేయడానికి ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. కాకపోతే ఈ రంగుల రాజకీయంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినా..ప్రజలు మాత్రం ఈ విషయంలో నెగిటివ్‌గా లేరని తెలుస్తోంది.

 

ప్రభుత్వాలు మారినప్పుడు ఈ రంగుల రాజకీయం మామూలే అని ప్రజలు భావిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లకు, వాటర్ ట్యాంకులు, పబ్లిక్ టాయలెట్లు లాంటి వాటికి పసుపు రంగు వేశారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం సచివాలయాలతో పాటు, వాటర్ ట్యాంకులు, కరెంట్ స్థంబాలు, రోడ్ల డివైడర్లు ఇలా కొన్నిటికి వైసీపీ రంగులు వేశారు. కానీ గ్రామ సచివాలయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అలాగే లక్ష మందికిపైనే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికాయి. కాబట్టి ప్రజలు రంగుల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: