దేశంలో తొలిసారిగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఆగిపోయాయి టీవీ సీరియల్స్‌ షూటింగ్స్‌. అప్పటి నుంచి పాత సీరియళ్లతోనే టీవీలు నెట్టుకొస్తున్నాయి. చాలా పాపులర్‌ ధారావాహికలను మళ్లీ చూసే భాగ్యం జనాలకు కలిగింది. కానీ.. షూటింగ్‌ ఆగిపోయిన సీరియల్స్‌లో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం జనాల్లో పోలేదు.

 

బుల్లితెరకు పాపులారిటీ పెరిగిన తర్వాత డైలీ సీరియల్స్‌కు జనాలు బాగా కనెక్ట్‌ అయ్యారు. మంచి టాక్‌ వచ్చిందంటే చాలు.. అనుకున్న భాగాలకంటే ఎపిసోడ్‌లను పొడిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోమవారం మొదలుపెడితే..కొన్ని శుక్రవారం.. ఇంకొన్ని శనివారం వరకూ ఏకధాటిగా ప్రసారం అవుతాయి. సీరియల్స్‌ డైలీ టీవీలలో ప్రసారం కావాలంటే రోజూ షూటింగ్‌ ఉండాల్సిందే. లేకపోతే తదుపరి ఎపిసోడ్‌ను టైమ్‌కు అందించలేరు.  వీటిల్లో కొన్ని సొంతంగా తీసేవి ఉంటాయి. ఇంకొన్ని ప్రైవేట్‌ సంస్థల ద్వారా తెరకెక్కేవి ఉంటాయి. 

 

వెండితెరపై అవకాశం దక్కని అనేక మంది బుల్లితెరపై  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ విధంగా టీవీ స్టార్స్‌గా పాపులర్‌ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే  నటీనటులు, టెక్నీషియన్స్‌, డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌, లేబర్‌ ఇలా పదివేల మంది వరకూ ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. ప్రతిరోజూ షూటింగ్స్‌ జరుగుతాయి. సారథి స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీలలో సీరియళ్ల షూటింగ్‌ల సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 

 

అలాంటి బుల్లితెర ఇండస్ట్రీ కరోనా కాటుకు కుదేలైంది. మొట్టమొదట లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో అప్పటి వరకూ సిద్ధంగా ఉన్న ఎపిసోడ్‌లను ప్రసారం చేసిన చానళ్లు.. వెంటనే  పాత సీరియళ్ల దుమ్ముదులిపాయి. అప్పట్లో పాపులర్‌గా నిలిచిన వాటిని లాక్‌డౌన్‌ సమయంలో పునః ప్రసారం చేశాయి. జనాలంతా ఇళ్ల దగ్గరే ఉండటంతో టీవీలకు అతుక్కుపోయారు. పాత చింతకాయ పచ్చడినే మహా ప్రసాదంగా భావించారు. 

 

పాత సీరియళ్లు ఉన్నాయి కాబట్టి టీవీలు నెట్టుకొచ్చాయి. కానీ.. ఈ రంగంపై ఆధారపడ్డ వారికి ఉపాధి లేకుండా పోయింది. పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది. తిరిగి ఎప్పుడు షూటింగ్‌లకు మొదలవుతాయా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇటీవల  షూటింగ్‌లు సందడిగా మొదలయ్యాయి. షూటింగ్‌ అంటే చాలా మంది పని చెయ్యాలి. అందుకే కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మేరకు  చర్యలు చేపట్టినా కరోనా ఊరుకోలేదు. కొందరు నటులకు  పాజిటివ్‌ రావడంతో మళ్లీ ప్యాకప్‌ చెప్పాల్సి వచ్చింది. 

 

మూడు నెలల తర్వాత షూటింగ్‌లు మొదలయ్యాయన్న సంతోషం మూడు రోజులు కూడా ఉండలేదు. భయం భయంగా లొకేషన్‌లోకి అడుగుపెట్టినవారు... అంతే టెన్షన్‌తో ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పట్లో షూటింగ్‌లు ఉంటాయో లేవో అన్న  సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: