తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అయితే ఇది దేశమంతా ఉన్నదే.. కానీ.. కరోనాపై తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొదట్లో కరోనా కట్టడిపై బాగానే దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

 

 

తాజాగా వాటికి సీపీఎం సైతం తోడయ్యింది. ధనిక రాష్ట్రం తెలంగాణలో ప్రజారోగ్యాన్ని పట్టించుకోరా?అంటూ సిపిఎమ్ పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నదన్న రాఘవులు... ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాల్లో కరోనా రోజురోజుకూ విస్తరించి పేదలు, సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తోందన్నారు.

 

 

తెలంగాణ ధనిక రాష్ట్రమని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కోసం ధనిక రాష్ట్రంలాగానే ఖర్చు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రయివేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లను ఆర్డినెన్స్‌ జారీ చేసి కరోనా వైద్యం కోసం స్వాధీనం చేసుకోవాలని రాఘవులు డిమాండ్‌ చేశారు.

 

 

కేరళ ధనిక రాష్ట్రం కాదనీ, వామపక్షాలు అధికారంలో ఉండడం వల్ల కరోనాను జయప్రదంగా నియంత్రించాయని రాఘవులు అంటున్నారు. అనేక దేశాలు ప్రయివేటు ఆస్పత్రులను జాతీయం చేశాయని రాఘవులు గుర్తు చేశారు. కరోనాకు గురైన ప్రజలను ఆదుకోవడంలో, కేసుల నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని రాఘవులు విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: