భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి దక్షిణాధినేత. ఒకే ఒక్క తెలుగువాడు. అలాగని పీవీకి బలమైన రాజకీయ బలగం లేదు. మరి, ఒక అనామక స్థాయి నుంచి.. ఆసేతు హిమాలయమంత ఎత్తుకు ఎలా ఎదిగారు. 

 

జూన్‌ 28, 1921... నాటి హైదరాబాద్‌ సంస్థానంలోని వరంగల్‌ జిల్లా.. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం... పురిటినొప్పులతో బాధపడుతున్న రుక్నాబాయి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి సీతారామారావు ఎంతో సంబరపడిపోయాడు. ఆ క్షణం వాళ్లది.. బిడ్డ పుట్టాడన్న ఆనందం మాత్రమే.. కానీ, భారతదేశపు దశ, దిశను మార్చే బహుముఖ ప్రజ్ఞాశాలి అవతాడని ఊహించి ఉండరు. కానీ, తదనంతర కాలంలో అదే జరిగింది. దేశం గర్వించే స్థాయికి కాదు.. ఆర్థికంగా అల్లకల్లోలంగా మారిన దేశాన్ని తన మేథస్సుతో ఆదుకుని అజరామర కీర్తిని సొంతం చేసుకున్నాడు పీవీ. 

 

పీవీ పుట్టింది లక్నేపల్లిలోనే అయినా.. ఎక్కువరోజులు అక్కడ గడప లేదు. కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు వెళ్లాల్సి వచ్చింది. పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు.. ఆయనను దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నర్సింహారావుగా మారి వంగర గ్రామానికి వెళ్లిపోయారు. అందుకే ఆయన స్వగ్రామం వంగరగా స్థిరపడిపోయింది. 

 

వరంగల్‌ జిల్లా వేలేరులో ప్రాథమిక విద్యను అభ్యసించిన పీవీ బాల్యం.. సరాదాగా గడిచింది. పండగలు, సెలవులు వచ్చినప్పుడు వంగరకు వచ్చేవారాయన. చిర్రగోనే ఆడుతూ, చెరువు కట్ట కింద ఈత కొడుతూ.. కబడ్డీ ఆడుతూ స్నేహితులతో ఆనందంగా గడిపేవారు పీవీ. ఆయనకు ఫుట్‌బాల్‌ గేమ్‌ అంటే ఇష్టమని చెబుతుంటారు. వరంగల్‌ నుంచి ఫుట్‌బాల్‌ తీసుకొచ్చి అందరికీ నేర్పేవారట. 

 

వరంగల్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న పీవీ.. పై చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే, నిజాం ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ వందేమాతర గీతాన్ని ఆలపించినందుకు.. అక్కడి నుంచి  బహిష్కృతులయ్యారు. దీంతో స్నేహితుడి సాయంతో నాగ్‌పూర్‌ విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి.. 1944లో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. గోల్డ్‌ మెడల్‌ సాధించారు. న్యాయవాది కావాలన్న తనకలను నెరవేర్చుకున్నారు. 

 

ఆ తర్వాత పీవీ అడుగులు మెల్లమెల్లగా ఉద్యమాలు, రాజకీయాల వైపు మళ్లాయి. స్వామి రామతీర్థానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుచరుడిగా అటు స్వాతంత్రోద్యమంలోనూ, ఇటు హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు పీవీ. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి పూర్తిస్థాయిలో రాజకీయాలకు అంకితమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: