దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని ప్రకటన చేసింది. ఈ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించామని మంచి ఫలితాలే వచ్చాయని సంస్థ చెబుతోంది. 
 
బీజింగ్ లో తయారు చేసిన రెండు రకాల వ్యాక్సిన్ లు మంచి ఫలితాలే ఇచ్చాయని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ ను తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో 1,120 మందికి ఇచ్చామని..... వారిలో ఈ టీకా యాంటీబాడీస్ తయారు చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా బయోటిక్ సంస్థ సోషల్ మీడియా వీ చాట్ లో ఈ విషయాలను వెల్లడించింది. అయితే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన అదనపు సమాచారం మాత్రం వెల్లడించలేదు. 
 
ఇదే సంస్థకు మరో శాఖ తయారు చేసిన వ్యాక్సిన్ మనుషుల్లో యాంటీ బాడీల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. చైనా ప్రభుత్వం ఆ దేశంలో తయారు చేసిన పలు టీకాలను మనుషులపై ప్రయోగిస్తున్నట్లు పేర్కొంది. భారీ సంఖ్యలో వాలంటీర్లను నియమించుకుని చైనా మూడో దశ ప్రయోగాలను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ టీకాను ప్రయోగించాల్సి ఉంది. 
 
కరోనా వైరస్ నియంత్రణ కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇవ్వడం శుభపరిణామం. అక్టోబర్ నెలాఖరులోపు ప్రజలకు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: