చైనాతో, కరోనాతో జరిగే రెండు యుద్ధాల్లోనూ మన దేశం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఢిల్లీలో కరోనా నియంత్రణలోనే ఉందన్నారు.  రాజధాని ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పారు అమిత్ షా. వలస కూలీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సరైన ప్రచారం లభించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

ఢిల్లీలో కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అమిత్ షా. ఈ నెల 30 నాటికి కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వే పూర్తి చేస్తామని, జులై 21 నాటికి ఢిల్లీ మొత్తం ఇంటింటి సర్వే చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని, చికిత్స విషయంలో కూడా ఇబ్బంది లేదని తెలిపారు అమిత్ షా. ఢిల్లీలో కమ్యూనిటీ వ్యాప్తి ఉందన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పారు. 

 

కరోనాతో పాటు సరిహద్దుల్లో చైనాతో జరుగుతున్న యుద్ధంలో కూడా భారత్ విజయం సాధిస్తుందన్నారు అమిత్ షా. ప్రధాని మోడీ నేతృత్వంలో రెండు పోరాటాల్లో దేశం గెలుస్తుందన్నారు.

 

అనేక రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు తరలించామని అమిత్ షా చెప్పారు. దగ్గరి ప్రాంతాలకు చెందిన వారిని బస్సుల్లో తరలించామని తెలిపారు. లాక్‌డౌన్ మొదలయిన దగ్గరనుంచి వలస కార్మికుల సమస్యలు, వారికి ఆహారం, వసతి సౌకర్యాలపై ప్రధాని మోడీ... అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల వెతలు ప్రధానిని, తనను ఎంతగానో కలచి వేశాయన్నారు అమిత్ షా. 

 

కేంద్రం కరోనా కట్టడిలో ఢిల్లీ ప్రభుత్వం, స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తోందని, సమన్వయానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశారు అమిత్ షా. ఢిల్లీ ప్రభుత్వానికి ఏ సాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: