సైనికుల శౌర్యమే దేశానికి బలమని చెప్పారు ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో అమర జవాన్ల త్యాగాన్ని కొనియాడారు. లాక్ డౌన్ టైమ్ లో కంటే.. ఇప్పుడే కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు మోడీ. చరిత్రలో ఎన్నో కష్టాలు అధిగమించినట్టే.. ఈసారి కూడా దేశం ముందడుగు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని. 

 

లద్దాక్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన  జాతినుద్దేశించి ప్రసంగించారు. గల్వాన్‌ ఘటనలో తమవారిని కోల్పోయిన కుటుంబాలు దేశ సేవకోసం తమ పిల్లలను కూడా పంపాలని కోరుకుంటున్నాయని.. మోడీ గుర్తుచేశారు. ప్రతి అమరవీరుడి కుటుంబంలో ఇదే స్ఫూర్తి నెలకొందని, దేశ రక్షణ కోసం మన జవాన్ల కమిట్ మెంట్ ఏమిటో ప్రపంచమంతా చూసిందన్నారు ప్రధాని. 

 

లాక్‌డౌన్‌ సమయంలో కన్నా ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందన్నారు మోడీ. మాస్కులు ధరించకుండా, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే మీతో పాటు ఇతరులను కూడా  ప్రమాదంలోకి నెడతారని హెచ్చరించారు. దేశ ప్రజలెవరూ అజాగ్రత్తగా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత ఎంతో మంది వలసజీవులు తమ స్వస్థలాల్లోనే జీవనోపాధి చూసుకుంటున్నారని తెలిపారు. 

 

ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురైన ఈ సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని మోడీ చెప్పారు. అయితే, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం శక్తివంతంగా ముందుకు సాగుతుందని చెప్పారు ప్రధాని. 

 

మొత్తానికి దేశ ప్రధాని మోడీ సైనికుల సేవలను కొనియాడారు. సరిహద్దుల్లో వాళ్ల పోరాటపటిమను చూసి దేశం గర్విస్తున్నట్టు చెప్పారు. అమరవీరుల సేవలను దేశప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు తాము ఎప్పుడూ అండా ఉంటామని హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: