కాపు సామాజికవర్గంలో ఉన్న పేద మహిళలని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కాపు నేస్తం పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున అయిదేళ్లపాటు రూ.75 వేలు మహిళల ఖాతాలో వేయనున్నారు. ఇక ఈ ఏడాది మహిళలకు రూ.15వేలు అందించారు. అయితే ఈ పథకంపై జనసేన అధినేత పవన్ విమర్శలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అంశాన్ని పక్కదోవ పట్టించడానికే జగన్ ఈ పథకం తీసుకొచ్చారని ఫైర్ అవుతున్నారు. అటు టీడీపీ కూడా జగన్ కాపులకు ద్రోహం చేస్తున్నారని, తమ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక ఈ కాపు నేస్తం పథకంతో కాపు రిజర్వేషన్లు అంశం తెరపైకి వచ్చింది. దశాబ్దాల కాలం నుంచి రిజర్వేషన్లు కోసం కాపులు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న తమని బీసీల్లో కలపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చి, ఐదేళ్ల పాటు ఆ కమిటీ, ఈ కమిటీ అని చెప్పి కాలయాపన చేశారు. రిజర్వేషన్లు కోసం ముద్రగడ పద్మనాభం లాంటి వారు చేసిన ఉద్యమాలని అణిచివేసే కార్యక్రమం చేశారు.

 

అయితే చివరిలో కాపులని బీసీ-ఎఫ్ కేటగిరీలో పెట్టి ఐదు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ ఆ అంశం అలా పెండింగ్‌లో ఉండగానే ఎన్నికలముందు కేంద్రం ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ 10 శాతంలో ఎవరికి ఎంత ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. దీంతో చంద్రబాబు 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయించింది. ఇక ఈలోపు ఎన్నికలు రావడం, జగన్ అధికారంలోకి రావడంతో కాపులకే 5 శాతం ఇస్తే మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి, అది క్యాన్సిల్ చేసి, అగ్ర‌వ‌ర్ణాల వారికి కేంద్రం కేటాయించిన ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్‌ను తిరిగి పున‌రుద్ధ‌రించింది. అయితే రిజర్వేషన్లు పునరుద్ధరించిన అమలులో మాత్రం లేవు.

 

ఈ క్రమంలోనే ఇటీవల అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. ఇక తాజాగా పవన్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా గ‌త ప్ర‌భుత్వం కాపుల‌కు ఇచ్చిన 5% రిజర్వేషన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వెనుకబడిన వర్గాలకు ఇప్పుడు ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు తోడు మరో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తే అదొక పెద్ద తలనొప్పి అవుతుందని జగన్ ప్రభుత్వం వాటి జోలికి వెళ్ళడం లేదని తెలుస్తోంది. ఇక ఈ పది శాతానికే దిక్కులేనప్పుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కష్టమే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: