టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన ఊరు నారావారిపల్లె...చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. అసలు చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచే రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. 1978లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో చంద్రబాబు కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే  ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి రావడం, కుప్పం నియోజకవర్గానికి మారి వరుసగా విజయాలు సాధించడం చూస్తూనే ఉన్నాం.

 

ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తే... చంద్రబాబు పుట్టిన నియోజకవర్గమైన చంద్రగిరిలో పసుపు జెండా ఎగిరింది కేవలం మూడుసార్లే. 1983, 1985, 1994 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. మిగిలిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరుసగా గెలిచారు. 2014లో టీడీపీ తరుపున గల్లా అరుణ కుమారి పోటీచేసి ఓడిపోయారు.

 

అయితే 2019 ఎన్నికల్లో అరుణకుమారి పోటీకి దూరంగా ఉండటంతో, టీడీపీ నేత పులివర్తి నాని పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 41 వేల ఓట్ల మెజారిటీతో చెవిరెడ్డి విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా అధికారంలో ఉండటం చెవిరెడ్డికి బాగా అడ్వాంటేజ్‌గా ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పనులు చేస్తున్నారు.

 

దీంతో ఇక్కడ వైసీపీ రోజురోజుకూ బలపడుతుంటే, టీడీపీ దిగజారిపోతుంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరుపున నామినేషన్స్ వేసేవారు కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నియోజకవర్గంలోని 95 ఎంపీటీసీల్లో 76 స్ధానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. ఏకగ్రీవాలైన ఎంపీటీసీ స్ధానాలన్నీ వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. దీని బట్టి చూసుకుంటే భవిష్యత్‌లో కూడా ఇక్కడ టీడీపీకి భవిష్యత్‌ లేదని అర్ధమైపోతుంది. చెవిరెడ్డిని అడ్డుకుని టీడీపీ గెలవడం కష్టమే అని తెలుస్తోంది. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాబు పుట్టిన నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరదు.

మరింత సమాచారం తెలుసుకోండి: