జగన్ 2019 ఎన్నికల్లో టీడీపీని కొట్టినదెబ్బ ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం కోలుకోవడం చేయడం మరో ఎత్తు అయిపోయింది. వరుస పెట్టి ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలని వైసీపీలోకి తీసుకోవడం, అలాగే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలని బయటపెడుతూ మరికొందరు నేతలకు చెక్ పెట్టడం చేస్తున్నారు. ఇంకా ఊహించని పథకాలు అమలు చేస్తూ, ఎన్నికల్లో టీడీపీ వైపు ఉన్న పలు సామాజికవర్గాలని తనవైపు తిప్పుకుంటున్నారు.

 

అదేవిధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, టీడీపీని వీక్ చేస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల వంటి సంచలన నిర్ణయంతో కాస్తో కూస్తో బలంగా ఉన్న విశాఖపట్నంలో టీడీపీని గట్టి దెబ్బ కొట్టారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటంతో ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి జై కొడుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీకి భారీ షాక్ తగిలింది. అయితే జగన్ దెబ్బకు  టీడీపీ ఇప్పటికీ కోలుకోలేకపోతుంది.

 

పైగా ఇక్కడ తమ్ముళ్ళు కూడా చేతులెత్తేయడం టీడీపీకి మరింత డ్యామేజ్ పెరుగుతుంది. నగరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు అడ్రెస్ ఉండటం లేదు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదో అలా అలా పార్టీలో కనిపిస్తున్నారు. అయితే సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు కాస్త యాక్టివ్‌గానే ఉంటున్నారు.

 

కానీ విశాఖ ప్రజలకు వీరిపై నమ్మకం ఎప్పుడో పోయింది. అటు యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు టీడీపీకి రాజీనామా చేసేశారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలోకి వచ్చేశారు. అటు అరకు ఎంపీగా పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్ అడ్రెస్ లేరు. విశాఖలో ఓడిన బాలయ్య చిన్నల్లుడు భరత్ పార్టీలో కనిపిస్తున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇలా జగన్ రాజధానుల నిర్ణయం, నేతలు సరిగా పనిచేయకపోవడం వల్ల విశాఖలో టీడీపీ వీక్ అయిపోయింది. జగన్ ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయం అమలు చేస్తే టీడీపీకి తగిలిన గాయం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: