మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పీవీ గొప్పతనాన్ని కొనియాడారు సీఎం కేసీఆర్. రాజకీయాలకు ఇది సమయం కాదంటూనే ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు కేసీఆర్‌. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానన్న కేసీఆర్‌... ప్రపంచానికి పీవీ కీర్తిని చాటేలా కార్యక్రమాలు చేస్తామన్నారు. 

 

మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించనుంది. జ్ఞానభూమిలో పీవీకి ఘనంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్‌... శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.  

 

పీవీ గురించి చెప్పాలంటే సాహసం కావాలని... ఆయనది 360 డిగ్రీల పర్సనాలిటీ అన్నారు కేసీఆర్. పీవీ కీర్తిని ప్రపంచానికి చాటేలా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. పీవీకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని... చేయాల్సిన వాళ్ళు చేయలేదని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సందర్భం కాదని... దీనిపై  సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు కేసీఆర్‌. 

 

గ్లోబల్ ఇండియా సృష్టికర్త పీవీ అన్నారు కేసీఆర్‌. నెహ్రు కి సమాంతరమైన వ్యక్తన్నారు. కాకతీయ యూనివర్సిటీ లో పీవీ పేరు మీద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు అకాడమీకి ఆయన పేరు పెడతామని తెలిపారు. పీవీ పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని, సెంట్రల్ యూనివర్సిటీ కి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు ముఖ్యమంత్రి. పీవీకి భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు కేసీఆర్‌. 

 

తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగానే కాదు... 73 దేశాల్లో కూడా పీవీ జయంతి ఉత్సవాలు జరిగాయన్నారు ఉత్సవ కమిటీ చైర్మన్ కేకే. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఏ రోజైన తెలంగాణ వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని చెప్పిన మొదటి వ్యక్తి పీవీ అన్నారు పోచారం. 

 

పీవీ జ్ఞానభూమిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, సీపీఐ నేత చాడా, జనసమితి అధ్యక్షుడు కోదండరాం సహా పలువురు ప్రముఖులు పీవీకి ఘన నివాళులు అర్పించారు. పీవీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జ్ఞానభూమిలో సర్వమత ప్రార్థనలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: